కనులపండువగా ఆదిదంపతుల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా ఆదిదంపతుల కల్యాణం

Oct 26 2026 11:57 PM | Updated on Oct 26 2026 11:57 PM

కొత్తకోట రూరల్‌: మండలంలోని కానాయపల్లి స్టేజీ సమీపంలో గల సుప్రసిద్ధ శైవక్షేత్రం కోటిలింగేశ్వర దత్త దేవస్థానంలో సోమవారం ఆదిదంపతుల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా శివపార్వతుల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి.. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కల్యాణం నిర్వహించారు. ఈ వేడుకను భక్తులు కనులారా తిలకించి భక్తిపారవశ్యంతో ఉప్పొంగారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఇంటర్‌ ప్రవేశాలకు చివరి అవకాశం

వనపర్తి: ఇంటర్మీడియట్‌ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు చివరి అవకాశం కల్పించినట్లు డీఐఈఓ కలకోట నరేంద్ర కుమార్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు పొందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నెల 29వ తేదీలోగా సమీప ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అందుబాటులో ఉన్న గ్రూపుల్లో వెంటనే ప్రవేశాలు పొందాలని కోరారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత ప్రవేశాల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. అలాగే ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 26 నుంచి ప్రారంభమైనట్లు తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్‌ 9వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు. విద్యార్థులు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా, ముందుగానే ఫీజు చెల్లించి పరీక్షలకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని డీఐఈఓ కోరారు.

ఆక్రమణల తొలగింపు

వనపర్తి: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్యకు కారణమవుతున్న రహదారి ఆక్రమణలపై మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపట్టారు. స్థానిక ప్రజావైద్యశాల రోడ్డులో ఆర్టీసీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ దుకాణదారులు ఏర్పాటుచేసిన రేకుల షెడ్లను సోమవారం కలెక్టర్‌ ఆదేశాల మేరకు తొలగించారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలు, వివిధ వ్యాపార సముదాయాలు ఉండటంతో ఈ రహదారిపై నిత్యం వాహనాలు, ప్రజల రాకపోకలు అధికంగా ఉంటాయి. అయితే ఆర్టీసీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని కొందరు తమ దుకాణాల ముందు సుమారు 10 నుంచి 15 అడుగుల వరకు రేకుల షెడ్లు ఏర్పాటు చేసుకోవడంతో రహదారి ఇరుకుగా మారింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పాటు, వినియోగదారులు తమ వాహనాలను నిలిపేందుకు కూడా స్థలం లేకుండా పోయింది. ఈ ఆక్రమణల కారణంగా నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు గుర్తించి.. పోలీసుల సహకారంతో తొలగించారు.

ఆర్టీసీ ఉద్యోగులకుభద్రత కల్పించాలి

వనపర్తి రూరల్‌: ప్రజలకు నిరంతరం సేవలందించే ఆర్టీసీ ఉద్యోగుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాల కార్యదర్శులు చలపతి, విశ్వనాథ్‌, నాగేశ్వర్‌, నాగరాజు డిమాండ్‌ చేశారు. మణుగూరు ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల భద్రతకు ఆర్టీసీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల రక్షణకు ప్రాధాన్యమివ్వాలని కోరారు. కండక్టర్‌పై దాడికి పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు బాధితురాలికి న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement