అందుబాటులోకి జాతీయస్థాయి విద్య | - | Sakshi
Sakshi News home page

అందుబాటులోకి జాతీయస్థాయి విద్య

Oct 26 2026 11:57 PM | Updated on Oct 26 2026 11:57 PM

● త్వరలో కేంద్రీయ విద్యాలయానికి సొంత భవనం

● నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి

వనపర్తి/వనపర్తి రూరల్‌: జిల్లా కేంద్రంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో స్థానిక విద్యార్థులకు జాతీయస్థాయి విద్య అందుబాటులోకి వచ్చిందని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి అన్నారు. నాగవరం శివారులో ఏర్పాటుచేసిన కేంద్రీయ విద్యాలయాన్ని సోమవారం స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభితో కలిసి ఆయన అధికారికంగా ప్రారంభించారు. అదే విధంగా స్థానిక హరిజనవాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రూ. 23.80 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు శంకుస్థాపన చేశారు. చిమనగుంటపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్‌బీఐ సీఎస్‌ఆర్‌ నిధులతో నిర్మించిన మరుగుదొడ్లు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. అతి తక్కువ సమయంలోనే విద్యాలయాన్ని ప్రారంభించి, విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. త్వరలోనే కేంద్రీయ విద్యాలయానికి సొంత భవనం నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం విద్యాలయం నిర్వహణ కోసం కలెక్టర్‌ అనువైన భవనాన్ని కేటాయించారని పేర్కొన్నారు. కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులకు దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రమాణాలకు అనుగుణంగా విద్యాబోధన అందుతుందని చెప్పారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలని ఆకాంక్షించారు.

● ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకు కేంద్రీయ విద్యాలయం మంజూరుకు ఎంతో కృషి చేశామన్నారు. ఎంపీ మల్లు రవి ఢిల్లీలో సంబంధిత స్థాయిలో నిరంతరం ప్రయత్నాలు చేయడం వల్ల విద్యాలయం ఏర్పాటు సాధ్యమైందన్నారు. ఇప్పటికే ప్రవేశాల ప్రక్రియ పూర్తిచేసుకున్నట్లు తెలిపారు. ఎంపీ మల్లు రవి సహకారంతో రూ.9 కోట్ల విలువైన సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా విద్యాలయానికి అవసరమైన పలు సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే జిల్లాలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపించామని.. ఇందుకోసం అనువైన భూమిని ఇప్పటికే పరిశీలించామని తెలిపారు.

● కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయం మంజూరుకు అవసరమైన అన్ని ప్రమాణాలను పరిశీలించిన అనంతరమే అనుమతులు లభిస్తాయన్నారు. వనపర్తిలో అందుకు తగ్గ ప్రమాణాలను మనం చూపించడంలో సఫలమయ్యామని.. అందుకే ఏర్పాటు సాధ్యమైందన్నారు. జిల్లాకు కేంద్రీయ విద్యాలయం తీసుకురావడంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎంతో సహకరించారన్నారు. విద్యాలయంలో ప్రవేశాల కోసం అధిక సంఖ్యలో దరఖాస్తులు రావడంతో నిబంధనల ప్రకారం లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని విద్యాసంస్థకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మాధవి, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌ గౌడ్‌, డీసీసీబీ మాజీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఈఓ యాదయ్య, సర్పంచ్‌ నీలమ్మ శివకుమార్‌, ఎంఈఓ మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement