వనపర్తి రూరల్: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి దీప కాసరగడ్డ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సోమవారం పెబ్బేరు మోడల్ స్కూల్‌లో నిర్వహంచిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యాహక్కు చట్టం ద్వారా 6 నుంచి 14 ఏళ్ల పిల్లలు ఉచిత విద్య పొందవచ్చన్నారు. బాల్యవివాహాల నిషేధిత చట్టం 2006 ప్రకారం 18 ఏళ్లలోపు అమ్మాయి, 21 ఏళ్లలోపు అబ్బాయిలకు వివాహాలు చేయడం చట్టవిరుద్ధమన్నారు. బాలకార్మిక చట్టం కింద 14 ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. అనంతరం పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సుధారాణి, డీసీఓ రాంబాబు, ఎస్‌ఐ వెంకటేశ్‌గౌడ్, ప్రిన్సిపల్ టి.నరేశ్‌కుమార్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కృష్ణయ్య, శ్రీదేవి పాల్గొన్నారు.


