ధాన్యం నిల్వలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం నిల్వలకు ఏర్పాట్లు

Oct 26 2026 2:16 AM | Updated on Oct 26 2026 2:16 AM

వనపర్తి: జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్న నేపథ్యంలో నిల్వ సామర్థ్యాన్ని పెంచేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం తరలివచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికే ఉన్న గోదాంలతో పాటు అదనపు నిల్వ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో అత్యధిక మిల్లులు డిఫాల్ట్‌ జాబితాలో ఉన్న కారణంగా కొనుగోలు చేసిన ధాన్యం నిల్వకు తాత్కాలిక కేంద్రాలు కీలకంగా మారనున్నాయి. అందుబాటులో ఉన్న గోదాముల సామర్థ్యం సరిపోకపోతే కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం పేరుకుపోయే అవకాశం ఉంటుంది. దీనిని అరికట్టేందుకు సుమారు లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేసేలా అద్దె, తాత్కాలిక గోదాంలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం అనువైన ప్రాంతాలను గుర్తించడం, అక్కడ ధాన్యం నిల్వకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం, వర్షం, తేమ నుంచి ధాన్యాన్ని సంరక్షించే ఏర్పాట్లు చేయడంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఎస్‌డబ్ల్యూసీ పర్యవేక్షణలో..

అద్దె, తాత్కాలిక గోదాంల ఏర్పాటు, ధాన్యం నిల్వకు సంబంధించిన బాధ్యతలను స్టేట్‌ వేర్‌హౌసింగ్‌ కార్పొరేషనన్‌ (ఎస్‌డబ్ల్యూసీ)కు పౌరసరఫరాలశాఖ అప్పగించింది. ధాన్యం నిల్వ సామర్థ్యాన్ని అంచనా వేసి అవసరమైన చోట్ల అదనపు వసతులను సిద్ధం చేయనున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి గోదాంలకు ధాన్యం తరలింపు, నిల్వ, అవసరమైన సమయంలో మిల్లులకు తరలించే ప్రక్రియను సమన్వయం చేయనున్నారు.

డిఫాల్ట్‌ మిల్లులకు ధాన్యం కేటాయించం..

జిల్లావ్యాప్తంగా 198 రైస్‌మిల్లులు ఉండగా.. కేవలం 45 మాత్రమే ధాన్యం కేటాయింపులకు అర్హత సాధించాయి. మిగతా మిల్లులన్నీ డిఫాల్ట్‌ కేటగిరీలో ఉన్నాయి. కాబట్టి ఈ సీజన్‌లో సేకరించిన ధాన్యం 45 మిల్లులకు సామర్థ్యం మేర కేటాయించి మిగతా ధాన్యాన్ని గోదాముల్లో నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లా సమీపంలోని ఏపీ ప్రాంతంలో సుమారు 50 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు అందుబాటులో ఉన్నాయని, అద్దెకు ఇచ్చేందుకు అక్కడి అధికారులు సముఖంగా ఉన్నారు. ఇక్కడి గోదాములు నిండితే వాటిని వినియోగించుకునేందుకు ఆలోచిస్తాం. – హరీశ్‌, డీఎం,

జిల్లా పౌరసరఫరాల కార్పొరేషన్‌

2.60 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలే లక్ష్యం

జిల్లాలో అధికంగా

డిఫాల్డ్‌ మిల్లర్లు ఉండటమే కారణం

నిల్వ సామర్థ్యం పెంపుపై కార్పొరేషన్‌ ప్రత్యేక దృష్టి

లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యం నిల్వ చేసే గోదాంల ఏర్పాటుకు అవకాశం

50 వేల టన్నుల నిల్వకుఏపీ సర్కారు గ్రీన్‌సిగ్నల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement