గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

Oct 26 2026 2:16 AM | Updated on Oct 26 2026 2:16 AM

చెరుకు రైతుల సమస్యలు పరిష్కరించాలి..

చెరుకు రైతుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలంటూ తెలంగాణ చెరుకు రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అమరచింతలో మంత్రి వాకిటి శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్‌ గోపి మాట్లాడుతూ.. ప్రభుత్వం సన్నరకం వరికి రూ.500 బోనస్‌ ఇస్తున్న మాదిరిగానే చెరుకు టన్నుకు సైతం రూ.వెయ్యి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చెరుకు టన్నుకు కనీస మద్దతు ధర రూ.6 వేలుగా నిర్ణయించాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కౌన్సిలర్‌ తిరుమలేష్‌, అరుణ్‌కుమార్‌, గోపాల్‌రెడ్డి, స్వామినాయక్‌, మున్ని, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

అమరచింత: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణతో మండల, గ్రామస్థాయిలో సమీక్షలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌పార్టీ మండలస్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రతి గ్రామంలోని సమస్యలను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గ్రామం నుంచి నియోజకవర్గస్థాయి వరకు సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రహదారులు, తాగునీరు, విద్యుత్‌, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం పురోగతి సాధిస్తుందనే నినాదంతో తమ ప్రభుత్వం గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించిందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతి క్యాబినెట్‌ సమావేశంలో గ్రామస్థాయి నుంచి అభివృద్ధి జరగాలని.. ఇందుకోసం అడిగినన్ని నిధులు వెంటనే మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తలెత్తే కరువు పరిస్థితుల గురించి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలపై ఉందన్నారు. జలాశయాల్లో నీటిమట్టం తగ్గుతోందని.. తాగునీటి సమస్యలు రాకుండా పొదుపుగా వినియోగించుకోవాలనే విషయాలను గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రైతులు అధైర్యపడకుండా ఉండాలని.. యాసంగిలో వరిసాగు చేయొద్దని సూచించారు. సంక్షేమ ఫలాలు అర్హులకే అందాలని, ఇందిరమ్మ ఇంటి బిల్లులు సకాలంలో లబ్ధిదారులకు అందినప్పుడే నిర్మాణాలు వేగవంతం అవుతాయని వివరించారు. అమరచింత మండలంలో విద్య, వైద్యం, రవాణా సదుపాయలను పూర్తిస్థాయిలో కల్పించేందుకు తనవంతు సహకారం ఉంటుందని వివరించారు. త్వరలోనే మినీ స్టేడియం, జూనియర్‌ కళాశాల పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గీతకార్మిక కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌ కేశం నాగరాజుగౌడ్‌, పార్టీ మండల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు రవికాంత్‌, పుర చైర్‌పర్సన్‌ జింక సువర్ణ, జిల్లా కార్యదర్శి రమేష్‌ ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement