వనపర్తి: భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల్లో ఓటు హక్కు అత్యంత కీలకమైందని ఏఐసీసీ జిల్లా పరిశీలకుడు రవీంద్రదాస్ అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ఓటుతో ఏర్పడిన ప్రభుత్వాలు అదే ఓటు హక్కును దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం తప్పదని, ఓటు హక్కును కాలరాసే ప్రయత్నాలు చేస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్‌పార్టీ పోరాటం కొనసాగిస్తుందని, ఓటు హక్కును కాపాడుకునే ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి మాట్లాడుతూ.. ఓటు చోరీకి పాల్పడుతూ ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు గుప్పించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్‌పార్టీ దేశవ్యాప్తంగా ‘ఓట్ బచావో.. దేశ్ బచావో’ నినాదంతో పోరాటం సాగిస్తోందని వెల్లడించారు. ఈ అంశంపై నవంబర్ 1న దేశ రాజధాని ఢిల్లీలో భారీ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని.. జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఓట్ల తొలగింపుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.. అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓటు చోరీ అంశంపై ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఇప్పటికే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో దేశ ప్రజలకు వాస్తవాలను వివరించారన్నారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు తిరుపతయ్య, సాయిచరణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, కాంగ్రెస్‌పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్, పుర వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


