గ్రామాల అభివృద్దే ధ్యేయం..
ఆత్మకూర్: ఎల్‌నినో ప్రభావంతో రానున్న వేసవి మరింత కఠినంగా ఉండే అవకాశం ఉందని.. సమష్టిగా ఎదుర్కొందామని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో సాధారణం కంటే అఽధిక ఉష్ణోగ్రతలు నమోదై వడగాలులు వీచే ప్రమాదం ఉందని, వృద్ధులు, చిన్నారులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి కొరత తలెత్తే అవకాశం ఉందని.. సాగునీటి ఇబ్బందులు, పశుగ్రాసం కొరత ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి అవసరాలకు రూ.కోటి విడుదలయ్యాయని .. గ్రామాల్లో నీటి సామర్థ్యం ఉన్న బోర్లను గుర్తించి లీజుకు తీసుకోవాలని, తాగునీటి కష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. అధికారులు, సర్పంచ్‌లు అప్రమత్తంగా ఉంటూ ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు ఇప్పటి నుంచే గుర్తించి మరమ్మతు చేపట్టాలని, అవసరమైనచోట బోర్లు, ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరాకు ప్రణాళిక రూపొందించుకోవాలని, ఉపాధి పథంకంలో నీటిసంరక్షణ పనులు, చెక్‌డ్యాంలు, ఇంకుడుగుంతల నిర్మాణాలు వేగవంతం చేయాలని, ప్రజలు, పశువులు, పక్షులకు ఎలాంటి కష్టాలు రాకుండా సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం 35 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరుపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో స్థానిక సంస్థళ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఐఈఓ నరేంద్రకుమార్, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, విండో అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, చైర్‌పర్సన్ నాగమణి, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీను, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శనివారం పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో గ్రామాల వారీగా నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో రూ.300 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని.. అవసరమైతే రూ.100 కోట్లు తీసుకొస్తానని భరోసానిచ్చారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, చేపడుతున్న అభివృద్ధి పనులు, గత పాలకుల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. అంతకుముందు ఆత్మకూర్‌లో ఆస్పత్రి, మార్కెట్‌యార్డు భవన నిర్మాణ పనులను పరిశీలించారు. గడువులోగా పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని, నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు.


