నీటి సంరక్షణపై విస్తృత అవగాహన | - | Sakshi
Sakshi News home page

నీటి సంరక్షణపై విస్తృత అవగాహన

Oct 25 2026 1:23 AM | Updated on Oct 25 2026 1:23 AM

వనపర్తి: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో నీటి సంరక్షణకు ప్రాధాన్యతనిస్తూ తాగునీటి వృథాను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి వచ్చే ఏడాది జూలై వరకు తాగునీటి సరఫరా ప్రణాళిక, వీబీజీ రాంజీ పథకం పనుల పురోగతి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై తహసీల్దార్లు, ఎంపీడీఓలతో వెబెక్స్‌లో సమావేశమై పలు కీలక సూచనలు చేశారు. రానున్న కాలంలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని నీటి సంరక్షణ చర్యలను పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రతి నీటి బొట్టును పొదుపుగా వినియోగించేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని.. నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 30 వరకు మిషన్‌ భగీరథ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగించాలన్నారు. తాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల పరిధిలో ఎక్కడైనా పైపులైన్‌ లీకేజీలు ఉన్నట్లయితే వెంటనే మరమ్మతు చేపట్టాని కోరారు. రానున్న వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, స్థానిక నీటి వనరులను వినియోగంలోకి తీసుకురావాలని, అవసరమైన చోట ప్రైవేటు బోర్లను తీసుకునేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో ఉపాధి కూలీల పనిదినాల కల్పనలో పురోగతి తక్కువగా ఉందని.. వెంటనే పెంచేలా మండలస్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా కూలీలను సమీకరించి పనులు చేపట్టాలని.. ఫాంపాండ్స్‌, ఇంకుడుగుంతలు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ నిర్మాణాలు వంటి నీటి సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పనుల అమలులో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షిస్తూ రూఫ్‌ రీప్లేస్‌మెంట్‌కు సంబంధించి నియోజకవర్గానికి 500 మంది లబ్ధిదారులను కేటాయించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి మండలాల వారీగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వివరాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా చేపట్టి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి, మిషన్‌ భగీరథ ఎస్‌ఈ, హౌసింగ్‌ పీడీ విఠోబా, సీపీఓ హరికృష్ణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement