కొత్తకోట రూరల్: కొత్తకోటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి వసంతోత్సవ శోభాయాత్ర గురువారం అంగరంగ వైభవంగా కొనసాగింది. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తర్వాత దసరా పండుగ మరుసటి రోజు వసంతోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. సాంప్రదాయంలో భాగంగా ఆలయ నిర్వాహకులు ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఆలయ ప్రాంగణం నుంచి పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా శోభాయాత్ర సాగింది. మహిళలు బతుకమ్మలతో పాల్గొనగా యువత కోలాటాలు, దాండియా నృత్యాలతో అలరించారు. భజనలు, ఆటపాటలు, బాణసంచా వెలుగులతో పురవీధులు సందడిగా మారాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భీమ చంద్రకాంత్, గౌరవ అధ్యక్షుడు భీమ ప్రభాకర్, శ్రీనివాసులు, శంకర్, భీమ కిషోర్, నర్సింహమూర్తి, భాస్కర్, జయలక్ష్మి, రాధిక, జ్యోతి, అనిత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
జాతీయ అథ్లెటిక్స్‌కు
షకీల్ ఎంపిక
వీపనగండ్ల: మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన ఎండీ షకీల్‌పాషా జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు టెక్నికల్ అఫీషియల్‌గా ఎంపికయ్యారు. వచ్చే నెల 14 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్‌లో 20వ నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్ మీట్ జరగనుంది. ఈ పోటీల నిర్వహణకు రాష్ట్రం నుంచి షకీల్‌పాషా ఎంపిక కావడంపై మండల ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈయన కొల్లాపూర్ మినీ స్టేడియంలో షాహీద్ ఫిట్‌నెస్ అకాడమీ పేరుతో ఎస్‌ఐ, కానిస్టేబుల్, ఆర్మీ ఉద్యోగార్థులకు శిక్షణ ఇస్తున్నారు.
అధిక దిగుబడులే
లక్ష్యం : డీఏఓ
ఆత్మకూర్: రైతులు అధిక దిగుబడులు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులు అన్నారు. గురువారం మండలంలోని జూరాల రైతువేదికలో ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టెలి కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. అనంతరం డీఏఓ పత్తి కొనుగోలు, భూ సంరక్షణ, ఎరువుల వినియోగం, ఎల్‌నినో ప్రభావం, సేంద్రియ వ్యవసాయం, ఆయిల్‌పాం సాగు, నీటిసంరక్షణ పద్ధతులు, వాతావరణ ఆధారిత వ్యవసాయం తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌యార్డు చైర్మన్ రహ్మతుల్లా, డీసీసీ కార్యదర్శి తులసీరాజ్ యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు రాయిచూర్ పరమేష్, మండల వ్యవసాయ అధికారి రమేష్‌నాయక్, అరవింద్, ఏఈఓలు ఝాన్సీ, సంతోష్, మహేష్, లక్ష్మి, చెన్నరాయుడు, కిషోర్ పాల్గొన్నారు.
ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని ఉమ్మడి పాలమూరు పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పండుగ సాయన్న స్ఫూర్తితో గురువారం పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు–రంగారెడ్డి నీళ్లు డిండి పేరుతో నల్లగొండకు తరలించే కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాలని, చంద్రసాగర్, అమ్రాబాద్ లిఫ్ట్ చేపట్టాలని కోరారు. కృష్ణ, బీమా నదుల సంగం తంగిడి నుంచి 72 జీఓ వేమరకు భారీ ఎత్తిపోతల పథకం చేపట్టాలని కోరారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధుల వరద పారించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పోరాటాల వీరుడు పండుగ సాయన్న స్ఫూర్తితో పాలమూరు ప్రాజెక్టులపై పోరాటం చేస్తామన్నారు. ఇందుకోసం లక్ష సంతకాల సేకరణ మహోద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.


