వనపర్తి: పోరాట యోధుడు పండుగ సాయన్న అని.. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్యఅతిథులుగా హాజరై సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పండుగ సాయన్న జీవిత చరిత్ర, ఆయన చేసిన పోరాటం, సమాజానికి అందించిన సేవలను వివరించారు. సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడి ప్రజల మన్ననలు పొందిన మహనీయుడని పేర్కొన్నారు. ధైర్యసాహసాలు, ప్రజా సంక్షేమం పట్ల నిబద్ధతకు ఆయన జీవితం నిదర్శనమన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పండుగ సాయన్న ఆశయాలను నేటి తరానికి తెలియజేయడంతో పాటు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక సమానత్వం, ఐకమత్యం, ప్రజాసేవ వంటి విలువలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న జీవిత చరిత్రపై కళాకారుడు రాజారాంప్రకాష్ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో పుర వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు, ఇతర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.


