వనపర్తి రూరల్: ప్రతి ఒక్కరూ ఆర్థిక భద్రతను పొందేందుకు ప్రభుత్వ బీమా, పింఛన్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ బీమా, పింఛన్ పథకాలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో గురువారం మండలంలోని నాచహళ్లి ప్రభుత్వ పాఠశాలలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్థిక సమ్మిళిత పథకాల ప్రచార శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబ్బంది ప్రజలకు వివిధ బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ బీమా, పింఛన్ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతను వివరించారు. ప్రధానమంత్రి సురక్ష బీమా, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా, అటల్ పెన్షన్ యోజన పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో ఏడాదికి కేవలం రూ.20 ప్రీమియం చెల్లించి రూ.2 లక్షల ప్రమాద బీమా రక్షణ పొందవచ్చన్నారు. ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన ద్వారా ఏడాదికి రూ.436 ప్రీమియం చెల్లించి, బీమా నిబంధనలకు అనుగుణంగా మరణించిన సందర్భంలో రూ.2 లక్షల బీమా ప్రయోజనం పొందవచ్చన్నారు. అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు అటల్ పింఛన్ యోజనపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ పథకానికి అర్హులైన అభ్యర్థులు నిబంధనలకు అనుగుణంగా క్రమం తప్పకుండా పొదుపు చేస్తూ వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత పొందవచ్చన్నారు. ఈ మూడు పథకాలు ప్రజల కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, అర్హులైన ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని సూచించారు.


