గోపాల్‌పేట: ఫిర్యాదుదారులకు ఎస్‌హెచ్‌ఓలు జవాబుదారీగా ఉండి వారి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేయాలని ఎస్పీ సునీతరెడ్డి ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం ఆమె స్థానిక పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులు, ఆవరణను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. కేసుల నమోదులో జాప్యం సరికాదని.. ఫిర్యాదు చేసిన రోజే పరిశీలించి కేసు నమోదు చేయాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం, మహిళలు, యువతులపై వేధింపులు జరగకుండా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఆమె వెంట డీఎస్పీ గిరిబాబు, సీఐ రత్నం, ఎస్సై శశిధర్ తదితరులు ఉన్నారు.
హామీల అమలును విస్మరించిన కాంగ్రెస్
వనపర్తి రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా యువత, ప్రజలను మోసం చేస్తూ కాలయాపన చేస్తోందని జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం జిల్లాకేంద్రంలోని కొత్త బస్టాండ్ దగ్గర బీజేవైఎం నాయకులతో కలిసి నల్లబ్యాడ్జీలు ధరించి వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సరూర్‌నగర్ వేదికగా ప్రియాంకగాంధీ యూత్ డిక్లరేషన్ పేరిట అధికారంలోకి రాగానే ఏటా 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ యువతకు ప్రతి నెల నిరుద్యోగ భృతిగా రూ.4 వేలు చెల్లిస్తామని గొప్పలు చెప్పారని గుర్తుచేశారు. అలాగే మహిళలకు స్కూటీలు, జాబ్ క్యాలెండర్ విడుదల, ఎస్సీ, ఎస్టీ యువతకు వడ్డీలేని రుణాలు వంటి హామీలు గుప్పించి అధికారంలోకి రాగానే పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, యువతను మోసం చేస్తున్న చేతకాని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వాణిజ్యసెల్ సభ్యుడు బశెట్టి శ్రీనివాసులు, అధికార ప్రతినిధి నక్క మహేష్, ఎస్సీమోర్చా అధ్యక్షుడు రవి, యువమోర్చా ప్రధానకార్యదర్శి జీఎస్ నవీన్, రాజేష్, కుబేర్, రఘు, రవి, రఘురాం, చంద్రశేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు.


