అమరచింత: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత కొలతలతో యూనిఫాంలు తయారుచేసి అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని సెర్ప్ డీఆర్డీఏ నాన్‌ఫామ్ డైరెక్టర్ జాన్సన్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని అమరచింత చేనేత ఉత్పత్తుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న టైలరింగ్ హబ్‌ను ఆయన సందర్శించారు. పాఠశాల యూనిఫాంలు కుడుతున్న మహిళలతో కాసేపు మాట్లాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల యూనిఫాంల తయారీకి అనుగుణంగా ఇకపై మండలానికో టైలరింగ్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడ అధునాతన కుట్టుమిషన్లతో పాటు కాజా, ఐరన్ యంత్రాలను వినియోగించి యూనిఫాంలను తయారు చేయడం బాగుందని కొనియాడారు. ప్రభుత్వం 2024 నుంచి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల యూనిఫాంలను ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. వీటి తయారీ బాధ్యతలను మహిళా సమాఖ్య సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు.


