ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 352 ప్రకారం 400 చదరపు అడుగుల బిల్డ్ అప్ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్ వైశాల్యం గరిష్టంగా 500 ఫీట్లలోపే ఉండాలి. 600 ఎస్‌ఎఫ్‌టీ ఏరియా కలిగిన ఇంటికి గరిష్టంగా 750 ఎస్‌ఎఫ్‌టీ వరకే ఉండాలి. ఇంటి ముందువైపు గరిష్టంగా మూడు అడుగులకు పరిమితం చేసి మిగిలిన మూడువైపులా ఒక్క అడుగు మాత్రమే పైకప్పు విస్తీర్ణం ఉండాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ నిబంధనలు ఈ నెల ఒకటి నుంచి అమలులోకి వచ్చాయి. స్లాబ్ విస్తీర్ణం పెంచితే బిల్లు చెల్లింపులు నిలిపివేస్తామని ఉత్తర్వుల్లో హెచ్చరించారు. ఇప్పటికే ఎక్కువ విస్తీర్ణంలో పైకప్పు వేసిన వారు హౌసింగ్ అధికారులను సంప్రదిస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే లబ్ధిదారులు ఆర్థికంగా నష్టపోతారని హౌసింగ్‌శాఖ పేర్కొంది. మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు జారీ చేసిన నోటీసులల్లో అధికారులు సూచించారు.


