వనపర్తి: జిల్లాకేంద్రంలో శుక్ర, శనివారం జరగనున్న వనపర్తి ఛాంపియన్స్‌కప్–2026 క్రీడా పోటీలను విజయవంతం చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం, ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో తొలిసారిగా పోటీలు నిర్వహిస్తున్నామని.. క్రీడా పోటీల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని, క్రీడా ప్రాంగణాలను సిద్ధం చేయడంతో పాటు క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, భోజనం, మరుగుదొడ్లు తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు. పోటీలను తిలకించేందుకు జిల్లాలోని 15 మండలాల క్రీడాకారులు, స్థానిక ప్రజలు, క్రీడాభిమానులు అధికసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున.. కూర్చునేందుకు కుర్చీలు, నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు సమకూర్చాలని కోరారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభోత్సవం, శనివారం సాయంత్రం ముగింపు కార్యక్రమం ఉంటుందని.. అవసరమైన ఏర్పాట్లను ముందస్తు ప్రణాళికతో పూర్తి చేయాలని జిల్లా యువజన క్రీడలశాఖ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శనివారం సాయంత్రం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు అవసరమైన ఏర్పాట్లు కూడా సమన్వయంతో చేపట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట డీవైఎస్‌ఓ సుధీర్‌కుమార్‌రెడ్డి, డీపీఆర్వో సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.


