వనపర్తి: బతుకమ్మ వేడుకలు మహిళల మధ్య ఐక్యత, పరస్పర ఆత్మీయతను పెంపొందిస్తాయని.. సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి కోరారు. గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె హాజరై బతుకమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానానికి, ప్రకృతిపై వారికున్న ఆరాధనా భావానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయ పాటలు పాడుతూ జరుపుకొనే ఈ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని చాటి చెబుతుందన్నారు. పండుగలను సమష్టిగా జరుపుకోవడం ద్వారా సామాజిక ఐక్యత, సంతోషం మరింత పెరుగుతాయని చెప్పారు. మహిళల సందడి, బతుకమ్మ పాటలతో కలెక్టరేట్ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. డీపీఆర్వో సీతారాంనాయక్, మహిళ, శిశు సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది, అంగనన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.


