రాయినిపల్లిలోనూ..
‘భీమా’ కాల్వలకు వారాబందీ విధానంలో సరఫరా
● చివరి ఆయకట్టుకు అందని వైనం
● ఘర్షణ పడుతున్న అన్నదాతలు
● అధికారుల పర్యవేక్షణ కరవు
భీమా కాల్వలకు వారాబందీ విధానంలో సాగునీరు సరఫరా చేస్తున్నాం. ఆ నీటిని నిబంధనల ప్రకారం పొదుపుగా వాడుకోవాలి. కాల్వలో ఉన్న గేట్లను తెరవడం, కిందకు దించే విషయంలోనే రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా నీటి సరఫరా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. – వినయ్, ఏఈ, భీమా కాల్వ
పాన్‌గల్: ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర నీటికొరత ఏర్పడి పలు ప్రాంతాల్లో సాగునీటికి రైతుల మధ్య తీవ్ర ఘర్షణలు, ఆందోళనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా వరి పంట చివరి దశకు చేరుకొని గింజ గట్టిపడే సమయంలో నీరందకపోవడంతో ఎండిపోతాయనే ఆందోళనతో రైతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. కాల్వలను అధికారులు పర్యవేక్షిస్తూ పైపులు, మోటార్లు, అడ్డుగా రాళ్లు తొలగిస్తూ చివరి ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా సరఫరా అందేలా చూస్తే ఇలాంటి ఘర్షణలు చోటు చేసుకునే అవకాశం ఉండదని పలువురు రైతులు అభిప్రాయపడుతున్నారు.
● పాన్‌గల్ మండలంలోని భీమా కాల్వకు జూరాల జలాశయం నుంచి నీరు సరఫరా అవుతుంది. కాల్వలో ఉన్న గేట్లు (షట్టర్లు) తెరిచే విషయంలో మంగళవారం మాందాపూర్, బుసిరెడ్డిపల్లి గ్రామాల రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాల్వ సమీపంలో సాగునీటి పారుదల అధికారులు, పోలీసుల సమక్షంలోనే తోసుకోవడం, పిడిగుద్దులతో దాడి చేసుకున్నారు. ప్రధాన భీమా కాల్వ 27వ ప్యాకేజీ ద్వారా మాందాపూర్, చింతకుంట గ్రామాల వైపు ఉన్న మైనర్ కాల్వకు నీరు రాకపోవడంతో ఆయా గ్రామాల రైతులు కాల్వలోని రెండు గేట్లను మూసివేశారు. దీంతో ముందున్న బుసిరెడ్డిపల్లి, రాయినిపల్లి, బండపల్లి, కొత్తపేట, బహుదూర్‌గూడెం, జమ్మాపూర్, కేతేపల్లి గ్రామాలకు సాగునీరు సరఫరా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల రైతులు కాల్వ దగ్గరకు చేరుకొని తమవైపు నీటి సరఫరా అయ్యే ఒక గేటును తెరిచే ప్రయత్నంలో ఇరువర్గాల రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు, నీటిపారుదలశాఖ అధికారులు అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేసి నిబంధనల ప్రకారం సాగునీరు అందేలా చూస్తామనడంతో ఘర్షణ సద్దుమణిగింది.
ఆరుగాలం కష్టపడి సాగుచేసిన పంటలను కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కాల్వల ద్వారా చివరి ఆయకట్టు వరకు సక్రమంగా సాగునీరు సరఫరా అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాల్వలను అధికారులు పర్యవేక్షిస్తూ సాగునీరు సాఫీగా అందేలా చూస్తే రైతుల మధ్య గొడవలు చోటు చేసుకోవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
భీమా కాల్వ ద్వారా రాయినిపల్లి గ్రామానికి సాగునీరు సరఫరా అయ్యే 21వ డిస్ట్రిబ్యూటరీ కాల్వ వద్ద మంగళవారం రాత్రి రైతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాల్వలో పైపులు వేయడంతో ముందున్న పంటలకు సాగునీరు అందడం లేదు. దీంతో కాల్వలో వేసిన పైపులు తొలగించాలని ముందు పొలాల రైతులు చెప్పడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో గ్రామానికి చెందిన రైతు మల్లేష్‌పై అదే గ్రామానికి చెందిన వెంకటస్వామి, రామచంద్రయ్య అనే రైతులు దాడి చేయడంతో తలకు గాయమైంది. బుధవారం ఎస్‌ఐ కుర్మయ్య భీమా కాల్వపై ఉన్న గేటును పరిశీలించారు. బాధిత రైతు ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామన్నారు. ఇలాంటి ఘర్షణలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.


