ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వొదు | - | Sakshi
Sakshi News home page

ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వొదు

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

వనపర్తి రూరల్‌: మెడికల్‌ దుకాణాల నిర్వాహకులు వైద్యుడి చీటి లేకుండా మందుల విక్రయాలు జరపరాదని, ప్రభుత్వ నిబంధనలు విధిగా పాటించాలని జిల్లా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ రష్మిక సూచించారు. సోమవారం పెబ్బేరులోని పలు మెడికల్‌ దుకాణాలను డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు రష్మిక, విశ్వనాథ్‌రెడ్డి, వినయ్‌ సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. వైద్యుల చీటి లేకుండా, బిల్లులు జారీ చేయకుండా మందులు విక్రయిస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్లు వారు తెలిపారు. నిబంధనల ఉల్లంఘన నేపథ్యంలో ఓ మెడికల్‌ దుకాణాన్ని 15 రోజుల పాటు సీజ్‌ చేశామన్నారు. ఇదేవిధంగా నాలుగు దుకాణాల్లో లోపాలను గుర్తించి నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. నోటీసులకు సరైన వివరణ ఇవ్వకపోతే ఆయా దుకాణాలపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సమాంతర కాల్వకు

నీటి సరఫరా

అమరచింత: జూరాల జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుందని చెబుతున్న అధికారులు సమాంతర కాల్వకు మాత్రం నీటి సరఫరాను నిలిపివేయలేకపోతున్నారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలకు నీటిని నిలిపివేసిన అధికారులు సమాంతర కాల్వకు మాత్రం నీటిని వదలడం ఏమిటని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. సమాంతర కాల్వ ద్వారా రోజు 900 క్యూసెక్కుల నీరు పారుతోందని.. ఎగువన ఉన్న ఆయకట్టు పంటలు ఎండుముఖం పడుతున్నా పట్టించుకోని అధికారులు సమాంతర కాల్వకు మాత్రం సాగునీటిని ఎందుకు సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలాశయానికి ఎగువ నుంచి వరద వస్తున్న సమయంలోనే సమాంతర కాల్వకు నీటిని విడుదల చేయాలనే నిబంధన ఉన్నా వరద లేని సమయంలో కూడా నీటిని వదలడం ఏమిటని రైతులు అధికారుల వైఖరిని తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని సమాంతర కాల్వ ఏఈ మహేందర్‌ వద్ద ప్రస్తావించగా.. లిఫ్ట్‌లకు సాగునీటిని పంపింగ్‌ చేస్తున్నట్లుగానే సమాంతర కాల్వకు నీటిని వదులుతున్నారని, కాల్వ పరిధిలో వరి పంటలు ఎండిపోకుండా నీటిని సరఫరా చేస్తున్నామని బదులిచ్చారు.

భూ రీ–సర్వేకు

ప్రత్యేక బృందాలు

వనపర్తి: జిల్లాలో రెవెన్యూ సమస్యలను సత్వరమే పరిష్కరించి ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ టి.వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి భూ రీ–సర్వే పురోగతి, పెండింగ్‌ దరఖాస్తులు, భూ–భారతి సేవలు, 22ఏ భూముల సమస్యలు, ఎస్‌ఐఆర్‌ నోటీసుల ప్రక్రియపై సమీక్షించారు. భూ రీ–సర్వే పనులను వేగవంతం చేసేందుకు ప్రతి మండలంలో రెండు ప్రత్యేక బందాలను తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. డిప్యూటీ తహసీల్దార్‌ పర్యవేక్షణలో ఒక బృందం, రెవెన్యూ ఇనన్‌స్పెక్టర్‌ లేదా సీనియర్‌ అసిస్టెంట్‌ పర్యవేక్షణలో మరో బృందాన్ని ఏర్పాటు చేయాలని, ప్రతి బృందంలో లైసెన్‌న్స్‌డ్‌ సర్వేయర్‌, జీపీఓ ఉండేలా చూడాలన్నారు. బృంద సభ్యులకు రీ–సర్వే విధివిధానాలపై పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. నిషేధిత భూముల జాబితా 22ఏకు సంబంధించి టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పెండింగ్‌ లేకుండా పరిష్కరించాలని స్పష్టం చేశారు. భూ–భారతి పోర్టల్‌లో అందుబాటులో ఉన్న నూతన మాడ్యూల్‌ ద్వారా ఒకే దరఖాస్తుతో వివిధ రెవెన్యూ సమస్యలను తెలియజేసే సౌలభ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ పెండింగ్‌ నోటీసుల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి సంబంధిత దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు బాధ్యతగా పనిచేస్తూ నిర్దేశిత లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఏడీఎస్‌ఎల్‌ఆర్‌, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్‌ అసిస్టెంట్లు, మండల సర్వేయర్లు, లైసెన్‌న్స్‌డ్‌ సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement