బాల్యవివాహాల నియంత్రణ బాధ్యత | - | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాల నియంత్రణ బాధ్యత

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

వనపర్తి రూరల్‌: బాల్యవివాహాలను అరికట్టడం అందరి బాధ్యతని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్‌ న్యాయమూర్తి దీప కాసరగడ్డ అన్నారు. సోమవారం మండలంలోని ఖాసీంనగర్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్యవివాహాల నిషేధిత చట్టం 2006 ప్రకారం అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండకుండా వివాహాలు చేయడం చట్ట విరుద్దమన్నారు. గ్రామాల్లో ఎవరైనా బాల్య వివాహాలు జరిపిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బాల్య కార్మిక చట్టం కింద 14 ఏళ్లలోపు బాలలను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. అదేవిధంగా గ్రామంలో ఏర్పాటు చేసిన లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను తనిఖీ చేశారు. సైబర్‌ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితో పంచుకోరాదని సూచించారు. వయోవృద్ధులైన తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం సరికాదని.. వారి సమస్యల పరిష్కారానికి ఆర్డీఓ కార్యాలయంలో ట్రిబ్యూనల్‌ ఏర్పాటు చేశామని, ఫిర్యాదు చేయాలని సూచించారు. లేకుంటే జిల్లా న్యాయసేవాధికార సంస్థలో దరఖాస్తు ఇచ్చినా పరిష్కారానికి కృషి చేస్తామని భరోసానిచ్చారు. జిల్లా కళా సాంస్కృతిక బృందం బాల్య వివాహాలపై తమ ఆటపాటలతో అవగాహన కల్పించారు. బాల్యవివాహాల నిర్మూలనకు పాటుపడతామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెంకటేష్‌, డీసీపీఓ రాంబాబు, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement