ఎమ్మెల్సీ ఓటరు జాబితా నోటిఫికేషన్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఓటరు జాబితా నోటిఫికేషన్‌ విడుదల

Sep 30 2026 12:46 AM | Updated on Sep 30 2026 12:46 AM

వనపర్తి: మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటరు జాబి తా నోటిఫికేషన్‌ను మంగళవారం కలెక్టరెట్‌ కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌లో కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకుగాను కొత్త ఓటరు జాబితా రూపొందిస్తున్నామని.. ఫారం–18 ఆఫ్‌లైన్‌లోగాని, ఆన్‌లైన్‌లోగాని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తునకు నవంబర్‌ 6 వరకు గడువు ఉందని తెలిపారు. జిల్లాలో అర్హులైన పట్టభద్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఉద్యాన రాయితీలను

వినియోగించుకోవాలి

పాన్‌గల్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పాం, పండ్ల తోటల పెంపకం, పందిరి సాగు, మల్చింగ్‌, డ్రిప్‌, కూరగాయాల నారు తదితర పథకాలకు రాయితీలను అందిస్తోందని.. రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన అధికారి విజయభాస్కర్‌, కేవీకే శాస్త్రవేత్త డా. రాజేందర్‌రెడ్డి కోరారు. మంగళవారం మండలంలోని తెల్లరాళ్లపల్లిలో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సుకు వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రత్తలు, అసమాన వర్షపాతం పరిస్థితుల్లో మామిడి తోటలను కాపాడుకోవడానికి రైతులు ముందస్తు ప్రణాళికతో యాజమాన్య పద్ధతులు పాటించాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. అవసరానికి మించి నత్రజని ఎరువులు వినియోగించకుండా సమతుల పోషక యాజమాన్యం పాటించాలన్నారు. పలువురు మామిడి రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకరాగా శాసీ్త్రయ పరిష్కారాలను సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన అధికారులు కృష్ణయ్య, బాలప్రకాశ్‌, డెవలప్‌మెంట్‌ కో–ఆర్డినేటర్‌ రవికుమార్‌ పాల్గొన్నారు.

అప్రమత్తతతోనే సైబర్‌ నేరాల నియంత్రణ

వనపర్తి: వయోవృద్ధులు డిజిటల్‌ సేవలను సురక్షితంగా వినియోగించుకోవడంతో పాటు ఆన్‌లైన్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ బాలాజీనాయక్‌ సూచించారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ అధికారి కె.సుధారాణి అధ్యక్షతన సైబర్‌ నేరాలు, ఆన్‌లైన్‌ మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. వయోవృద్ధులు ఓటీపీ, యూపీఐ పిన్‌, ఏటీఎం పిన్‌, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదన్నారు. అనుమానాస్పద లింకులు, ఫోన్‌కాల్స్‌, మెసేజ్‌లు, ఆన్‌లైన్‌ ఆఫర్లు, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంకు అధికారులు, పోలీస్‌ అధికారులు, ప్రభుత్వ అధికారులు అని చెప్పి ఫోన్‌చేసే వ్యక్తులను నమ్మి ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయవద్దని, సైబర్‌ మోసానికి గురైన వెంటనే సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1930 సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్‌ సిటిజన్‌ కమిటీ సభ్యులు సూర్యనారాయణ, టీఎస్‌జీఆర్‌ఈ అసోసియేషన్‌ సభ్యులు నర్సింహ, ఎంఏ సత్తార్‌, నాగేంద్రస్వామి, కామర్‌ రహమాన్‌, వనిత జ్యోతి మహిళా సంఘం, అహ్మద్‌ అమీర్‌, సీడీపీఓ అమృతమ్మ, రాంబాబు, జిల్లా సంక్షేమశాఖ అధికారులు, సిబ్బంది, వృద్ధాశ్రమాల నిర్వాహకులు, సంబంధిత ప్రతినిధులు పాల్గొన్నారు.

‘108’ వాహనం తనిఖీ

వనపర్తి రూరల్‌: పెబ్బేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని 108 వాహనాన్ని మంగళవారం క్వాలిటీ ఆఫీసర్‌ వెంకటేష్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని ఔషదాలు, సామగ్రి, వాహన పరికరాలను పరిశీలించారు. రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని పైలెట్‌ ఖాజా, ఈఎంటీ మహమూద్‌ను ఆదేశించారు. ఆయన వెంట ఉమ్మడి జిల్లా పోగ్రామ్‌ మేనేజర్‌ రవికుమార్‌, జిల్లా అధికారి దుర్గాప్రసాద్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement