మదనాపురం: ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు కమ్యూనిస్టు భావజాలం విస్తరిస్తోందని.. అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి వస్తున్నాయని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ అబ్బాస్ స్పష్టం చేశారు. మంగళవారం మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డ్ హమాలీ విశ్రాంతి భవనంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మండ్ల రాజు అధ్యక్షతన జరిగిన సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై కమ్యూనిస్టు పార్టీ మేనిఫెస్టో అంశాలను సవివరంగా విశ్లేషించారు. ఇటీవల శ్రీలంకలో కమ్యూనిస్టు పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిందని, అలాగే అమెరికా సామ్రాజ్యవాద కేంద్రమైన న్యూయార్క్‌లో సైతం విజయం నమోదు చేసిందని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు సైతం కమ్యూనిస్టు మేనిఫెస్టోను అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. దేశంలో ఎన్నికల నిర్వహణ విధానంపై పెద్దఎత్తున బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షాలు, వామపక్ష పార్టీలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, బాల్‌రెడ్డి, జీఎస్ గోపి, జిల్లా నాయకులు వెంకట్రాములు, మేకల ఆంజనేయులు, ఎస్.రాజు, మహబూబ్‌పాషా, వెంకటయ్య, వెంకటేష్, నిక్సన్, అజయ్ పాల్గొన్నారు.


