వరద ఒడిసి పట్టేదెలా..? | - | Sakshi
Sakshi News home page

వరద ఒడిసి పట్టేదెలా..?

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

అచ్చంపేట: కృష్ణానదికి వచ్చే వరదను ఒడిసి పట్టుకోలేని దుస్థితి నెలకొంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంలోనూ ఎగువన కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు 184 టీఎంసీల వరద వచ్చింది. అయితే ఈ జలాశయం ఆధారంగా కృష్ణానదికి వచ్చే వరద నీటిని పూర్తిస్థాయిలో వాడుకోలేని పరిస్థితి దాపురించింది. రోజుకు 4 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నా 2,400 క్యూసెక్కులు మాత్రమే పంపింగ్‌ చేస్తున్నారు. కేఎల్‌ఐ ద్వారా 4.25 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలి. ఈ ప్రాజెక్టు కింద ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్ల సామర్థ్యం 4 టీఎంసీలు మాత్రమే. కాల్వల ద్వారా చెరువులు, కుంటలకు నీరు వదులుతున్నా చివరి ఆయకట్టుకు అందడం లేదు. దీంతో అదనపు రిజర్వాయర్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం హయాంలో పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. అయితే రెండేళ్ల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షలో కేఎల్‌ఐ కింద రిజర్వాయర్ల సామర్థ్యం పెపు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించినా ఇంత వరకు అడుగు ముందకు పడలేదు.

ప్రతిపాదనలు బుట్టదాఖలు..

కేఎల్‌ఐ కింద 47 అదనపు రిజర్వాయర్లను ప్రతిపాదించగా వీటిలో కేవలం 10 మాత్రమే సాధ్యమని గుర్తించారు. ఇందుకు సంబంధించి సర్వే పూర్తి చేసి గత ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పూర్తి ఆయకట్టకు సాగునీరు అందించాలంటే కనీసం 30 టీఎంసీలు నిల్వ చేసే సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు అవసరమని సాగునీటిశాఖ అధికారులు చెబుతున్నారు. గత ప్రభుత్వం రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుపై డీపీఆర్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు ఇంజినీరింగ్‌ అధికారులు 2.14 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న జొన్నలబొగుడ జలాశయాన్ని 6 టీఎంసీలకు, టీఎంసీ సామర్థ్యం గల గుడిపల్లిగట్టు జలాశయాన్ని 3–4 టీఎంసీలకు పెంచుకోవచ్చని అంచనా వేశారు. ప్రతిపాదించిన ప్రకారం నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కల్వకుర్తి పరిధిలో ఇప్పటి వరకు ఒక్క రిజర్వాయర్‌ మంజూరు చేయని రాష్ట్ర ప్రభుత్వం 2023 మార్చి 2న వనపర్తి ప్రాంతంలోని ఘనపూర్‌ గణప సముద్రం, బుద్దారం చెరువులను రిజర్వాయర్లుగా మార్చేందుకు రూ.97.2 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో కేఎల్‌ఐ కింద మొదట ప్రతిపాదించిన ప్రాంతాలకు రిజర్వాయర్లు మంజూరు చేయకుండా పాలకులు చిన్నచూపు చూస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కృష్ణానీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు కరువు

భారీ జలాశయాలు లేక తప్పని పరిస్థితుల్లో దిగువకు..

ప్రతిపాదనల్లోనే జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు సామర్థ్యం పెంపు

చివరి ఆయకట్టుకు తీరని సాగునీటి కష్టాలు

చెరువులు, కుంటలు, కాల్వలపై ఆధారపడే పంటల సాగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement