పేదోడికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

పేదోడికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం

Sep 26 2026 1:38 AM | Updated on Sep 26 2026 1:38 AM

వనపర్తి: ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొనే ఆర్థిక స్తోమత లేని వారికి ప్రభుత్వం ఒకేసారి బిల్లులు చెల్లించే వెసులుబాటు కల్పించిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్లడించారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చేలా ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరై ఆర్థిక స్తోమత లేక సుమారు 300 మంది లబ్ధిదారులు నిర్మించుకోలేదని.. వారు ఒప్పుకుంటే కాంట్రాక్టర్‌ ద్వారా నిర్మించి ఇచ్చే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు. లబ్ధిదారు, కాంట్రాక్టర్‌, బ్యాంకర్‌ ముగ్గురి పేరిట ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరిచి నిర్మాణ పని జరిగే విధంగా ముందుగా డబ్బులు లబ్ధిదారుని ఖాతాలో జమచేసి అనంతరం కాంట్రాక్టర్‌కు బదిలీ చేస్తారని వివరించారు. 418 చదరపు అడుగుల్లోపు 9 పిల్లర్లు, రెండు అడుగుల బేస్‌మెంట్‌ వరకు వేసి సిమెంట్‌ ఇటుకలతో ఒక హాల్‌, బెడ్‌రూమ్‌, కిచెన్‌, స్నానపు గది, మరుగుదొడ్డి నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఒప్పుకొని స్వచ్ఛందంగా కాంట్రాక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకుంటే మూడు నెలల్లో ఇల్లు పూర్తిచేసి అప్పగిస్తారన్నారు. అనంతరం కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి జిల్లాలో మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల పురోగతి వివరాలను వెల్లడించారు. కాంట్రాక్టర్‌ లబ్ధిదారులకు ఇల్లు ఎలా నిర్మించి ఇస్తారు, నాణ్యత ప్రమాణాలను వీడియో క్లిప్పింగ్‌ ప్రదర్శించి చూపించారు. సమావేశంలో హౌజింగ్‌ పీడీ విటోబా, పుర చైర్‌పర్సన్‌ మాధవి, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, పెబ్బేరు పుర చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు సర్పంచులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement