ఆత్మకూర్: ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో రానున్న వేసవి మరింత కఠినంగా ఉండే అవకాశం ఉందని.. అప్రమత్తతతోనే అడ్డుకట్ట వేయవచ్చని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవా–2026 వికసిత్ భారత్ పంచాయతీ ప్రణాళికలో భాగంగా శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అమరచింత, ఆత్మకూర్ మండలాల సర్పంచ్‌లు, ఈజీఎస్, ఐకేపీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఎల్‌నినోతో సాధారణం కంటే అఽధిక ఉష్ణోగ్రతలు నమోదై వడగాలులు వీచే ప్రమాదం ఉందని, దీని ప్రభావం ప్రజారోగ్యంపై పడుతుందని, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, సాగునీటి ఇబ్బందులు తలెత్తి పంటలు దెబ్బతింటాయని, పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విపత్తుల సమయంలో అధికారులు, సర్పంచ్‌లు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు పక్కా ప్రణాళికతో నివారణ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ప్రతి గ్రామంలో తాగునీటి వనరులు ఇప్పటి నుంచే గుర్తించి మరమ్మతులు చేపట్టాలని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాకు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. ఉపాధి పథకం ద్వారా నీటిసంరక్షణ పనులు, చెక్‌డ్యాంలు, ఇంకుడుగుంతల నిర్మాణాలు వేగవంతం చేయాలని, ప్రజలు, పశువులకు ఎలాంటి కష్టాలు రాకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులతో నీటి సంరక్షణ చర్యలు చేపడతామని ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో ఎంపీడీఓలు శ్రీరాంరెడ్డి, శ్రీనివాసులు, ఏపీఓలు రఘుపతిరెడ్డి, అరుణ, ఈసీ రఘు పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం..
అమరచింత: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, పుర చైర్‌పర్సన్ జింక సువర్ణ రవి,కౌన్సిలర్ రాములు అన్నారు. శుక్రవారం పుర పరిధిలోని 6వ వార్డులో నిర్వహించిన ఫ్రై డే.. డ్రై డే కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటి పరిసరాల్లో మురుగు నిల్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తడి, పొడి చెత్తను విధిగా వీధిలోకి వచ్చే చెత్త సేకరణ ట్రాక్టర్లలో వేయాలని సూచించారు. ఈ సందర్భంగా కాలనీలోని మురుగు ప్రదేశాలను గుర్తించి దోమల నివారణ మందు పిచికారీ చేశారు. పుర కమిషనర్ నూరుల్ నదీం, పుర మేనేజర్ యూసూఫ్, మోప్మా. పుర సిబ్బంది పాల్గొన్నారు.


