వనపర్తి: ప్రజల జీవన విధానాన్ని మెరుగుపర్చేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన ప్రజా సంక్షేమ పథకాలను రద్దు చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌చౌక్‌లో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆడబిడ్డలకు ఆర్థిక భరోసానిచ్చే షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను నిలిపివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ పాలకులు మునుపటి పథకాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తే ప్రజాగ్రహానికి గురవుతారన్నారు. కరోనా సమయంలోనూ తమ ప్రభుత్వం ఆయా పథకాలను కొనసాగించిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆసరా పింఛన్ రూ.4 వేలు, దివ్యాంగ పింఛన్ రూ.6 వేలు, ప్రతి మహిళకు రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్‌పార్టీ చేసిన మోసాన్ని ప్రశ్నించాలని ప్రజలను కోరారు. ఎల్‌నినో సాకుచూపి సాగునీరు అందించకుండా రైతులను మోసం చేస్తున్నారని, శ్రీశైలం ప్రాజెక్టులో నీటిలభ్యతను బట్టి యాసంగి, వర్షాకాలం పంటలకు నీరు సరిపోతుందన్నారు. ఆంధ్రా ప్రయోజనాల కోసం సీఎం తెలంగాణ రైతులకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. 200 రోజులు మోటార్లు నడిపితే ఇక్కడి భూములు సస్యశ్యామలం అవుతాయన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్ పార్టీని తిట్టడం తప్పా.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టవా అని ప్రశ్నించారు. తెలంగాణ హక్కులు కాపాడటానికి పోతిరెడ్డిపాడు సందర్శనను వెళ్తే ఆంధ్రా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. ఆదిత్యదాస్ అనే ఆంధ్రా అధికారిని రేవంత్ తన దగ్గర పెట్టుకొని తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. అధికారులు ప్రజల పక్షాన పని చేయాలేగాని.. ప్రభుత్వంలో ఉన్నవారి మాటలకు వత్తాసు పలకడం సరికాదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న ఉద్యోగులను గుర్తు పెట్టుకుంటామని, పోలీసులు నిష్పక్షితంగా వ్యవహరించాలని సూచించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు పడావ్ పెట్టడాన్ని నిరసిస్తూ పోరాటాలు చేస్తామన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, నందిమళ్ల అశోక్, శ్రీకర్‌గౌడ్, పరంజ్యోతి, మాణిక్యం, ఉంగ్లం తిరుమల్, నాగన్న యాదవ్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, మురశిసాగర్, మహేశ్వర్‌రెడ్డి, మహిళా కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.


