అమరచింత: కార్మిక, కర్షక హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సోమవారం నిర్వహించే జైల్‌భరో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అఖిల భారత ఐక్యరైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాజన్న, ఆంజనేయులు పిలుపునిచ్చారు. ఆదివారం జైల్‌భరోకు సంబంధించిన కరపత్రాలను పట్టణంలోని దుకాణ యజమానులకు పంపిణీ చేసి మాట్లాడారు. దేశసంపదంతా అదాని, అంబానీలకు కట్టబెడుతూ కార్మికుల్ని మరింత బానిసలుగా, రైతుల్ని పేదలుగా మార్చడానికి ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని ఆరోపించారు. కార్మిక చట్టాలను తిరిగి సాధించుకునే వరకు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు తీవ్రతరం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, మసలమని, కురుమన్న, ఏసన్న, కుర్మానాయక్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
రేపు బీచుపల్లిలోసీతారాముల కల్యాణం
ఎర్రవల్లి: బీచుపల్లి క్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం సీతారాముల కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పునర్వసు నక్షత్రం సందర్భంగా నిర్వహించే రాములోరి కల్యాణోత్వసంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆయన కోరారు.
యునెస్కో గుర్తింపు కల్పించండి
అలంపూర్: అలంపూర్ క్షేత్రానికి యునెస్కో గుర్తింపు కల్పించాలని సీనియర్ సిటిజన్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మోహన్‌రావు కోరారు. ఈ మేరకు ఆదివారం నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలంపూర్‌లోని పురాతన ఆలయాల సముదాయం గత చరిత్ర, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ ప్రాంతానికి యునెస్కో గుర్తింపు లభిస్తే.. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల రాక పెరగడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని తెలిపారు. అదే విధంగా అలంపూర్ క్షేత్రంలో భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా భక్తులకు రవాణా సౌకర్యం మెరుగుపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ప్రసాద్ స్కీం భవనంలో భక్తులకు అన్నప్రసాద సత్రం, వసతి గృహాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
విద్యా సమానత్వం కోసం ప్రజలు పోరాడాలి
అచ్చంపేట రూరల్: విద్యా సమానత్వం కోసం ప్రజలు పోరాడాల్సిన అవసరముందని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో నిర్వహించిన పాలమూరు అధ్యయన వేదిక జిల్లాశాఖ కన్వీనర్, సామాజికవేత్త బాలజంగయ్య 4వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం విద్య వ్యాపార వస్తువుగా మారిపోయిందని.. మార్కెట్‌లో అధిక ధరకు విక్రయించే సరుకుగా విద్యను మార్చడం ఆందోళనకరమన్నారు. దేశంలో కామన్ స్కూల్ విద్యావిధానం అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. శతాబ్దాల క్రితమే వివిధ దేశాల్లో ప్రజల సామాజిక అవసరాలకు అనుగుణంగా ఈ విధానం అమలులోకి వచ్చిందన్నారు. దేశంలో సామాజిక అసమానతలు పూర్తిగా తొలగిపోయే వరకు రిజర్వేషన్లు కొనసాగాల్సిందేనని అన్నారు. ఇటీవల యువత చేపట్టిన ఉద్యమాలు అనేక సామాజిక అంశాలను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకొచ్చాయన్నారు. బలమైన రాజకీయ, సామాజిక శక్తులు సైతం యువత ఉద్యమాల ముందు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులను నిర్వీర్యం చేసే ప్రయత్నాలను ప్రజలు, యువత అప్రమత్తంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పాలమూరు అధ్యయన వేదిక హైదరాబాద్ కమిటీ మెంబర్ ప్రొ. జి.విజయ్, డా. శ్రీనివాస్, పీబీ స్వామి, లక్ష్మణ్, లక్ష్మీనారాయణ, శ్రీశైలం పాల్గొన్నారు.


