ప్రజలకు పారదర్శక, నాణ్యమైన సేవలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు పారదర్శక, నాణ్యమైన సేవలు

Jul 5 2026 2:18 AM | Updated on Jul 5 2026 2:18 AM

వనపర్తి: ప్రతి పోలీసు అధికారి బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ క్రమశిక్షణ, సమన్వయంతో ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఎస్పీ డి.సునీతారెడ్డి ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయ సమావేశ మందిరంలో స్పెషల్‌ బ్రాంచ్‌, ఐటీ కోర్‌, డీసీఆర్బీ, కంట్రోల్‌ రూమ్‌, సైబర్‌ క్రైం, నార్కోటిక్‌, ఏఆర్‌, జిల్లా పోలీసు కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో సమన్వయ సమావేశం నిర్వహించారు. విభాగాల వారీగా విధులు, బాధ్యతలు, సమన్వయం, సమాచార మార్పిడి, సాంకేతిక వ్యవస్థల వినియోగం, పెండింగ్‌ పనుల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు. డీజీపీతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించిన అంశాలను వివరించి ప్రతి విభాగం విధులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించేలా అవసరమైన మార్గదర్శకాలను అందించారు. ప్రతి విభాగం ఒకదానికొకటి అనుసంధానంగా పనిచేసినప్పుడే ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలు అందించగలుగుతామని చెప్పారు. సమాచార సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సమయపాలన, బాధ్యతాయుత పనితీరే పోలీసుశాఖ ప్రతిష్టను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయని తెలిపారు. ఏఆర్‌ అదనపు ఎస్పీ వీరారెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయం ఏఓ సునంద, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, డీసీఆర్బీ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి, జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

‘సంచార లోక్‌ అదాలత్‌’ వినియోగించుకోవాలి

వనపర్తి రూరల్‌: సంచార లోక్‌ అదాలత్‌ సేవలు వినియోగించుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి కళార్చన కోరారు. శనివారం మండలంలోని చిట్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కక్షిదారులు రాజీపడి కేసులు పరిష్కరించుకోవడంతో సమయం, డబ్బు ఆదా చేసుకోవచ్చన్నారు. రాజీమార్గం ఎంచుకున్న కక్షిదారులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే సంచార లోక్‌అదాలత్‌ వాహనం ద్వారా గ్రామాలకే వచ్చి పరిష్కరిస్తామని పేర్కొన్నారు. వాహనంలో ఏర్పాటు చేసిన తెరపై లఘు చిత్రాలను ప్రదర్శించి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ, డ్రగ్స్‌, సైబర్‌క్రైమ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సర్పంచ్‌ శోభ , ఏస్‌ఐ హృశికేష్‌, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ కృష్ణయ్య పాల్గొన్నారు.

విద్యార్థుల సంఖ్య పెంచాలి

వనపర్తి రూరల్‌/వనపర్తి ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఇన్‌చార్జ్‌ జిల్లా విద్యాధికారి యాదయ్య ఆదేశించారు. శనివారం మండలంలోని చందాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాల, దత్తాయపల్లి ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతుల వారీగా విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్‌, మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలు, అసంపూర్తిగా ఉన్న డైనింగ్‌ హాల్‌, నీటి సంపును పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి, బోధన–అభ్యసన ప్రక్రియపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం నాణ్యతగా అందించాలన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. చందాపూర్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు బొజ్జిబాబు, ఉపాధ్యాయ బృందం డీఈఓను శాలువాతో సన్మానించింది. ఆయన వెంట సెక్టోరియల్‌ అధికారి చంద్రశేఖర్‌, ఎస్‌ఎంసీ చైర్మన్‌ రాములు, ఉపాధ్యాయులు బాలనాగయ్య, విష్ణు, మంజుల తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement