వేసవిలో ఆక్సిజన్ అందక మృతిచెందే ప్రమాదం
● జాగ్రత్తలు పాటిస్తే నియంత్రణ సాధ్యం
● అవగాహన కల్పిస్తామంటున్న మత్స్యశాఖ అధికారులు
మృతిచెందిన చేపలు
తొలగించాలి..
చెరువులో చనిపోయిన చేపలను తొలగించి చెరువుకు దూరంగా కాల్చివేయాలి లేదా గోతి తీసి పూడ్చిపెట్టాలి. వెంటనే సున్నమును హెక్టారుకు 100 నుంచి 250 కిలోల మోతాదులో చల్లాలి. అప్పటికీ అదుపులోకి రాకుంటే నీటినాణ్యత పెంచే రసాయనాలు అనగా బీకేఎస్‌ను హెక్టార్‌కు లీటరు చొప్పున నీటిలో కలిపి చెరువులో చల్లాలి. ఈ చర్యలతో నీటి నాణ్యత పెరగడమే కాకుండా చేపలపై ఉన్న పరాన్న జీవులు చనిపోతాయి. ప్రాణ వాయువు పెంచడానికి చెరువులోని నీటిని మోటార్ల ద్వారా రీసైక్లింగ్ చేయాలి. అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తే వేసవిలో చేపలు చనిపోకుండా ఉంటాయి.
– డా. లక్ష్మప్ప, ఏడీ, మత్స్యశాఖ
అమరచింత: జిల్లాలోని చెరువులు, కుంటలతో పాటు రిజర్వాయర్‌లలో మత్స్యకారులు చేపల పెంపకం చేపడుతున్నారు. వేసవిలో నీరు వేడెక్కి ఆక్సిజన్ అందక మృతిచెందే ప్రమాదం ఉంటుంది. తగిన ముందస్తు చర్యలు చేపడితే చేపలు మృతి చెందకుండా నివారించే అవకాశం ఉందని మత్స్యశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈసారి రాయితీ చేప పిల్లల పంపిణీ ఆలస్యం కావడంతో ఎదుగుదల లేక మత్స్యకారులు ఆందోళన చెందుతున్న తరుణంలోనే ఎండల తీవ్రత పెరుగుతోంది. దీంతో ఉన్న చేప పిల్లలను ఎలా బతికించుకోవాలని సతమతమవుతున్నారు. వేసవిలో అధిక ఉష్ణ్రోగ్రత, చేపల సాంద్రత అధికంగా ఉండటం, నీరు క్రమేపి తగ్గడంతో నీటిలో ప్రాణవాయువు కొరత, నాణ్యత తగ్గిపోవడం తదితర కారణాలతో చేపలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటాయి. రోగకారక సూక్ష్మజీవులతో వ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కావున మత్స్యకారులు ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉందని అధికారులు వివరించారు.
నిషితంగా పరిశీలిస్తే..
చెరువులోని నీటి నాణ్యత, లోతు, విస్తీర్ణం, చేపల కదలికలను రోజు గమనిస్తూ ఉండాలి. మచ్చుకు కొన్ని చేపలు పట్టి వాటి పెరుగుదల, రంగు, తోక, రెక్కల స్వభావంతో పాటు మొప్పల రంగు, పై జిగురు లక్షణాలను నిశితంగా పరిశీలించాలి. తేడాలు గమనించిన తర్వాత సంబంధిత మత్స్యశాఖ అధికారి సలహాలు, సూచనలు తీసుకొని నివారణ చర్యలు సత్వరమే చేపడితే ఆర్థిక నష్టాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చు.


