
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
వనపర్తి: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టి ప్రతిమలను ఏర్పాటుచేసి పూజిద్దామని ఎస్పీ రావుల గిరిధర్ సూచించారు. వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి ప్రతిమల పంపిణీకి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పండుగలు, పర్వదినాలు ప్రజలు తమ కుటుంబంతో ఆనందంగా గడపడానికి ఏర్పాటు చేసుకున్నవని, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరస్పరం ప్రేమపూర్వకంగా జరుపుకోవాలనేది ప్రధాన ఉద్దేశమన్నారు. సమాజంలో కొన్ని పండుగలు ఇతరులకు ఇబ్బందులు కలిగించడమేగాక పర్యావరణానికి కూడా విఘాతం కలిగిస్తున్నాయని.. అలాంటి వాటిని నియంత్రించకపోతే మనకేగాక రానున్న తరాలపై కూడా దుష్ప్రభావం చూపుతాయని వివరించారు. కార్యక్రమంలో వనపర్తి సీఐ కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, రిజర్వ్ సీఐలు అప్పలనాయుడు, శ్రీనివాస్, వనపర్తి పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్, డీసీఆర్బీ ఎస్‌ఐలు తిరుపతిరెడ్డి, బాలయ్య, రిజర్వ్ ఎస్‌ఐ వినోద్, ట్రాఫిక్ రిజర్వ్ ఎస్‌ఐ సురేందర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.