వర్షం.. హర్షం | - | Sakshi
Sakshi News home page

వర్షం.. హర్షం

Aug 19 2025 6:52 AM | Updated on Aug 19 2025 6:52 AM

వర్షం.. హర్షం

వర్షం.. హర్షం

వనపర్తి/పాన్‌గల్‌: జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో మట్టిమిద్దెలు, శిథిల ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి ఖిల్లా ఘనపురం మండలం సల్కెలాపురం, అప్పారెడ్డిపల్లి, ఉప్పరిపల్లిలో ఒక్కో ఇల్లు కూలిపోయాయి. వనపర్తి మండలం చిమనగుంటపల్లిలో ఒకటి, పెద్దగూడెం గ్రామంలో ఒకటి, అంకూరులో రెండు, పెబ్బేరు మండలంలోని సూగూరులో ఒకటి, శ్రీరంగాపురం మండలంలోని తాటిపాములలో రెండు ఇళ్లు కూలగా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

పాన్‌గల్‌ మండలంలో..

మండలంలోని రేమద్దుల సమీపంలోని నల్లచెరువు కుంట అలుగు ఉధృతికి రోడ్డు కోతకు గురైంది. దీంతో కొల్లాపూర్‌, మైలారం, సింగాయిపల్లికి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే వాహనాలను పాన్‌గల్‌–శాగాపూర్‌ మీదుగా మళ్లించారు. కోతకు గురైన రహదారిపై రాకపోకలు సాగించకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు పహారా కాస్తున్నారు. మండలంలోని కిష్టాపూర్‌తండా సమీపంలో కేఎల్‌ఐ డీ–8, ఎంజే–4 కాల్వ రెండు ప్రాంతాల్లో కోతకు గురై పంటలు నీట మునిగాయి. కిష్టాపూర్‌తండాకు చెందిన రైతు వశురాంనాయక్‌ 3 ఎకరాల వేరుశనగ పంట నీట మునిగి మొలకెత్తి నష్టం వాటిల్లింది. భూత్పూర్‌ రిజర్వాయర్‌ ఎడమ కాల్వ వరదతో అమరచింత పెద్ద చెరువు సోమవారం అలుగు పారింది.

● ఉమ్మడి గోపాల్‌పేట మండలంలోని పొలికెపాడులో వాగు నీటి ఉధృతికి సమీపంలోని వరి పంటలు నీట మునిగి ఇసుక మేటలు వేసింది. అలాగే తాడిపర్తిలో మట్టిమిద్దె కూలింది.

● జిల్లాలో సోమవారం నాటికి 505 చెరువులు అలుగు పారుతుండగా.. మరో 309 చెరువులు వందశాతం నీటితో నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. రామన్‌పాడు, సరళాసాగర్‌, గోపాల్‌దిన్నె ప్రాజెక్టులకు భారీగా వరద చేరుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నా సాయం అందించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. ఏ సమయంలోనైనా కాల్‌చేస్తే స్పందించేలా మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఖిల్లాఘనపురం 64.3

మదనాపురం 58,3

అమరచింత 37.5

వీపనగండ్ల

4.3

ఆత్మకూరు

42.3

జిల్లావ్యాప్తంగా విస్తృతంగా కురుస్తున్న వానలు

నిండుకుండను తలపిస్తున్న చెరువులు, కుంటలు

కూలిన పలు శిథిల నివాసాలు

రహదారులపై నీరు పారి రాకపోకలకు అంతరాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement