
యూరియా కొరత లేదు
వనపర్తి: జిల్లాలో యూరియా, ఇతర ఎరువుల కొరత లేదని ఇన్‌చార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య తెలిపారు. పంటల సాగు, యూరియా లభ్యతపై సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్‌లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. గతేడాది వానాకాలంలో జిల్లాకు 16,780 మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించగా ఆగస్టు వరకు 10,209 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగించినట్లు వివరించారు. ఈ ఏడాది 19 వేల మెట్రిక్ టన్నులు కేటాయించగా.. నేటి వరకు 12,845 మెట్రిక్ టన్నులు వచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 2,538 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని, ఇందులో అత్యధికంగా డీలర్ల వద్ద 1,526 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు తెలిపారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లో మరో 1,500 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని.. జిల్లాలో యూరియాతో పాటు ఇతర కాంప్లెక్స్, డీఏపీ తదితర ఎరువులు సరిపడా ఉన్నాయని చెప్పారు. యూరియాతో పాటు ఫర్టిలైజర్ కొనాలని ఎవరైనా డీలర్లు రైతును వత్తిడి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో యూరియా సమస్యలపై వెంటనే స్పందించేందుకు కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశామని.. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సెల్‌నంబర్ 89777 56114 ఫిర్యాదు చేయాలన్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్, ఏడీఏలు, మార్కెటింగ్ అధికారి, కో–ఆపరేటివ్ అధికారి పాల్గొన్నారు.