
విచారణలో జాప్యమెందుకో..?
వనపర్తి: ఇటీవల అక్రమంగా సుమారు 450 బస్తాల సన్నరకం వరి ధాన్యం లారీలో కర్ణాటకకు తరలిస్తుండగా సీసీఎస్ పోలీసులు పెబ్బేరులో పట్టుకున్న అంశంపై అఽధికారులు స్పష్టతనివ్వకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. వరి ధాన్యం ఏ సీజన్‌కు చెందినది.. ఎక్కడికి వెళ్తుంది.. ప్రభుత్వ ముద్రణతో ఉన్న గన్నీ బస్తాల్లో ఎందుకు తరలించాల్సి వస్తుందనే విషయాలపై పౌరసరఫరాలశాఖ అధికారుల విచారణ ఇప్పటి వరకు ఎందుకు ముందుకు సాగడం లేదనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. 2023లో అదే పెబ్బేరులోనే ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంటే.. అప్పటి అధికారులు ఒక్కరోజులోనే కేసునమోదు చేశారు. విచారణలో మిగతా విషయాలు తేల్చి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాన్ని పరిశీలించాల్సి ఉంది. మునుపు అధికారులు ఇలాంటి నిబంధనలనే పాటించేవారు. తాజా ఘటనపై ముందుగా అనాలసిస్‌కు సిఫారస్ చేసి నివేదిక వచ్చిన తర్వాతే కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ధాన్యం అక్రమ రవాణా చేస్తున్న లారీని సీసీఎస్ పోలీసులు పట్టుకున్న తర్వాత సైతం కేసునమోదు చేసేందుకు సిఫారస్ చేయడంలో పౌరసరఫరాలశాఖ అధికారులు నాన్చుడు ధోరణి ఎందుకు ప్రదర్శిస్తున్నారన్న విషయంపై సమాధానం లేకపోవడం గమనార్హం.
టీఏలకు అనాలసిస్ బాధ్యతలు..
ఇలాంటి ఘటనల్లో బియ్యానికి ఓ రకమైన పరీక్షలు, ధాన్యానికి మరో రకమైన పరీక్షలు చేయడం ఆనవాయితి. ధాన్యం అక్రమంగా తరలిస్తున్నప్పుడు అది ఏ సీజన్‌లో పండించిందనే విషయాన్ని ల్యాబ్‌లోగాని, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లుగాని సులువుగా పరీక్షించి చెప్పగలరు. కానీ ఇలాంటి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా వారి ఆధీనంలో పనిచేసే టీఏలకే అనాలసిస్ బాధ్యతలు అప్పగించడం ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా చేసింది.
● ఇందుకు సంబంధించిన దస్త్రాన్ని ఇదివరకే అదనపు కలెక్టర్‌కు అందజేశామని చెప్పిన డీఎస్‌ఓ సోమవారం మాటమార్చి అనాలసిస్ రిపోర్ట్ వచ్చాక నివేదిస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే సిద్ధం చేసి అందజేశామని చెప్పారు కదా అని అడుగగా.. వరుస సెలవులు, వర్షాలు, ఇతర పనుల వత్తిడితో ఫైల్ అదనపు కలెక్టర్ వద్దకు తీసుకెళ్లలేదని చెప్పడం గమనార్హం.
విచారణ నివేదిక
తర్వాతే చర్యలు..
ఇప్పటి వరకు విచారణ నివేదిక నా వద్దకు రాలేదు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ ప్రాథమిక విచారణ నివేదిక, టెక్నికల్ అసిస్టెంట్లతో డీఎస్‌ఓ సేకరించిన అనాలసిస్, ఇతర నివేదికల దస్త్రం వచ్చాక పరిశీలించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై స్పష్టతనిస్తాం. ప్రభుత్వ గన్నీబ్యాగు లు ఎందుకు ఉపయోగించారనే విషయంతో పాటు ధాన్యం ఏజ్‌ను అనాలసిస్ చేయిస్తాం.
– ఖీమ్యానాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్
నాలుగు రోజులు గడుస్తున్నా.. కలెక్టరేట్‌కు చేరని దస్త్రం
పరీక్షల పేరుతో తాత్సారం చేస్తున్న అధికారులు