
వేగంగా ‘రెవెన్యూ’ దరఖాస్తుల పరిష్కారం
వనపర్తి: భూ భారతి – 2025 ప్రకారం రెవెన్యూ సదస్సుల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాలోని తహసీల్దార్లతో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, వారం రోజుల్లో పరిష్కరించిన దరఖాస్తులపై చర్చించారు. వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించాలని, ఆర్డీఓ, కలెక్టర్ లాగిన్‌కు పంపించే వాటికి తగిన ఆధారాలను జత చేయాలని ఆదేశించారు. పెండింగ్ మ్యుటేషన్, సక్షేషన్ దరఖాస్తులు నిబంధనల ప్రకారం రుసుం తీసుకొని ఆమోదం తెలపాలని సూచించారు. తిరస్కరించాల్సిన దరఖాస్తులకు తగిన కారణాలతో నివేదిక సిద్ధం చేసుకోవాలని, కలెక్టర్ ఆమోదం తర్వాతే సీసీఎల్‌ఏకు పంపించాల్సి ఉంటుందని తెలిపారు. సాదాబైనామా దరఖాస్తులు ఆమోదించాల్సినవి.. తిరస్కరించాల్సినవి సరైన కారణాలతో సిద్ధంగా ఉంచాలన్నారు. దరఖాస్తులను ఆమోదించడంగాని, తగిన కారణాలతో తిరస్కరించడంగాని జరగాలని.. పెండింగ్‌లో ఉంచితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, డి–సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్