
సాగు సంబురం
జూరాల ఆయకట్టులో చివరి అంకానికి వరి నాట్లు
●
ఐదెకరాల్లో వరి సాగు..
జూరాల కాల్వలకు సాగునీటిని వదలడంతో 5 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా. సకాలంలో నీటిని అందించడంతో నారుమడులు సిద్ధం చేసుకోవడంతో పాటు త్వరగా నాట్లు పూర్తి చేసుకునే అవకాశం కలిగింది. వరి సాగుకు ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి అవుతోంది.
– రఘురాంరెడ్డి, అమరచింత
అమరచింత
ఎత్తిపోతల కింద..
అమరచింత ఎత్తిపోతల కాల్వ కింద నాలుగు ఎకరాల పంట పొలం ఉంది. ఏటా వరి పంట సాగుచేస్తున్నా. వానాకాలం వరిసాగుకు నారుమడిని సిద్ధం చేసుకున్నా. సకాలంలో నీటిని వదలడంతో సాగు పనులు ప్రారంభించా. పుష్కలంగా నీరు పారుతుండటంతో సకాలంలో పంట చేతికొచ్చే అవకాశం ఉంది.
– వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, అమరచింత
ముందస్తుగానే నీటి విడుదల..
ప్రభుత్వ ఆదేశాలతో జూరాల ప్రధాన ఎడమ కాల్వ ఆయకట్టుకు ముందస్తుగా సాగునీటిని వదులుతున్నాం. ఈసారి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో సాగునీటిని నిరంతరం అందిస్తాం. చివరి ఆయకట్టు అయిన వీపనగండ్ల వరకు అంతరాయం లేకుండా కాల్వ ద్వారా సాగునీరు పారేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈసారి 85 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారని సిబ్బంది తెలిపారు.
– జగన్మోహన్, ఈఈ,
జూరాల ప్రాజెక్టు నందిమళ్ల డ్యాం డివిజన్
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగులో బిజీగా ఉన్నారు. ఆయకట్టుకు కేవలం ఆరుతడి పంటలకే సాగునీరు అందించాలని అధికారులు నిర్ణయించినా.. ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద చేరుతుండటంతో కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని వదులుతున్నారు. ఈ ఏడాది రైతులు ఆయకట్టు పరిధిలోని 85 వేల ఎకరాల్లో వరి పండించేందుకు సిద్ధమవగా.. ఇప్పటికే వరి నాట్లు వేసే ప్రక్రియ చివరి అంకానికి చేరింది. ఈసారి వరి నాట్లకు కూలీల కొరతతో పాటు కూలి అధికంగా డిమాండ్ చేస్తుండటంతో యంత్రాలతో సైతం నాట్లు వేసుకోవడం కనిపించింది. ఏడేళ్లుగా ఆయకట్టుకు వారబందీ విధానంలో నీటిని అందించి పంటలను కాపాడుతున్న అధికారులు ఈ ఏడాది ఎత్తేశారు. ఐఏబీ సమావేశంలో చర్చించిన అధికారులు ఏడమ కాల్వ పరిధిలోని పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీరు అందించాలని నిర్ణయించారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని అమరచింత, ఆత్మకూర్, మదనాపురం, కొత్తకోట, పెబ్బేరు, శ్రీరంగాపురం, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల పరిధిలో 97 కిలోమీటర్ల పొడవున జూరాల ప్రధాన ఎడమ కాల్వ విస్తరించి ఉంది. ఆయా మండలాల్లోని పూర్తిస్థాయి ఆయకట్టు సాగుకుగాను అధికారులు ముందస్తుగా కాల్వలకు నీటిని వదులుతున్నారు.
ఎత్తిపోతల పథకాలకు..
జూరాల కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేసిన అధికారులు జలాశయం ఆధారపడిన ఎత్తిపోతల పథకాలకు సైతం నీటిని వదులుతున్నారు. దీంతో అమరచింత, చంద్రగడ్, కోయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతలు, రంగసముద్రంతో పాటు జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. అలాగే ఆయా ఎత్తిపోతల పథకాల ఆయకట్టులో సైతం సాగు పనులు కొనసాగుతున్నాయి.
సన్నరకాలకే ఆసక్తి..
ప్రభుత్వం గత వానాకాలం నుంచి సన్నరకం వరికి క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తుండటంతో రైతులు ఈసారి కూడా సన్నరకం వరి పండించేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కువగా సోనామసూరితో పాటు ఆర్‌ఎన్‌ఆర్ రకాలు సాగు చేయడం కనిపించింది. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు.
ఎడమ కాల్వ పరిధిలో 85 వేల ఎకరాల సాగు
వరికే అన్నదాతల మక్కువ
వానకాలం పంటలకు పూర్తిస్థాయిలో నీటి విడుదల

సాగు సంబురం

సాగు సంబురం

సాగు సంబురం

సాగు సంబురం