
సోదరభావానికి ప్రతీక ‘రక్షాబంధన్’
వనపర్తి: రక్షాబంధన్ సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని, పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ రావుల గిరిధర్ కోరారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని సరస్వతి శిశుమందిర్ విద్యార్థినులు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ, కార్యాలయ అధికారులు, సిబ్బందికి రాఖీలు కట్టి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జీవితాంతం తమకు అండగా ఉండాలని ఆడబిడ్డలు తమ అన్నదమ్ముల చేతికి అనురాగంతో రాఖీ కట్టడం గొప్ప సాంప్రదాయమన్నారు.
15న అరుణాచలానికి ప్రత్యేక బస్సు
వనపర్తిటౌన్: వనపర్తి డిపో నుంచి ఈ నెల 15న సాయంత్రం 8 గంటలకు అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అరుణాచలంతో పాటు కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం తిరిగి 18వ తేదీన ఉదయం 4 గంటలకు జిల్లాకేంద్రానికి చేరుతుందని పేర్కొన్నారు. రాను, పోను టికెట్ ధర రూ.3,600గా నిర్ణయించామని.. భక్తులు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీట్ల రిజర్వేషన్, పూర్తి వివరాలకు సెల్‌నంబర్లు 99592 26289, 79957 01851, 73828 29379 సంప్రదించాలని తెలిపారు.
108 వాహనం తనిఖీ
పాన్‌గల్: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో ఉన్న 108 వాహనాన్ని శుక్రవారం జిల్లా ఈఈఎం (ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్) మహబూబ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక వైద్య పరికరాలు, ఆక్సిజన్, రికార్డులను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. బాధితుల నుంచి ఫోన్‌కాల్ వచ్చిన వెంటనే త్వరగా ఘటనా స్థలానికి చేరుకొని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి తరలించేలా చూడాలన్నారు.
కాంగ్రెస్ హామీలు నీటి మూటలేనా? : బీజేపీ
వనపర్తిటౌన్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని, బీసీ విద్యార్థులకు ప్రొఫెషనల్ కోర్సుల్లో పూర్తి రియింబర్స్‌మెంట్ చెల్లిస్తామని ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగిలాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ ఆరోపించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ అమలుకు చట్టబద్ధతతో కూడిన కమిషన్ వేయాలని సూచించారు. బీఆర్‌ఎస్ హయాంలో పెండింగ్‌లో ఉన్న బకాయిలు, బీసీ యువతకు వడ్డీ లేని రూ.10 లక్షల రుణాలు, కల్లుగీత, మత్స్యకార, రజక ఫెడరేషన్లకు రూ.10 లక్షలు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు ఆర్.వెంకటేశ్వర్‌రెడ్డి, బి.కుమారస్వామి, భాశెట్టి శ్రీను, పెద్దిరాజు, ఆగుపోగు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నిండుకుండలా రామన్‌పాడు జలాశయం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో శుక్రవారం పూర్తిస్థాయి నీటిమట్టం 1,021 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 1,080 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 729 క్యూసెక్కుల వరద జలాశయానికి కొనసాగుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 875 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 55 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 873 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు.

సోదరభావానికి ప్రతీక ‘రక్షాబంధన్’

సోదరభావానికి ప్రతీక ‘రక్షాబంధన్’