
అవసరం మేరకే ఎరువుల విక్రయం
వనపర్తి: రైతులకు అవసరం మేరకే ఎరువులు విక్రయించాలని.. ఎక్కువగా అమ్మి కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదర్శ్ సురభి హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులుగౌడ్‌తో కలిసి ఎంఏఓలు, ఏఈఓలతో వెబెక్స్‌లో సమావేశం సమావేశమయ్యారు. అనంతరం జిల్లాకేంద్రంలోని రాజనగరంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల విక్రయ దుకాణాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఒక్కో రైతుకు ఎన్ని బస్తాల యూరియా విక్రయిస్తున్నారనే విషయాన్ని పరిశీలించి ఇవ్వాల్సిన దానికన్నా అదనంగా విక్రయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువుల కొరత తలెత్తకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని.. మండల వ్యవసాయ అధికారులు దృష్టి సారించి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఎకరా సాగుకు ఒకటి లేదా రెండు బస్తాలు మాత్రమే ఇవ్వాలన్నారు. అదేవిధంగా ఎరువుల నిల్వలకు సంబంధించిన బోర్డును పరిశీలించి ఎప్పటికప్పుడు వివరాలను సరి చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట మండల వ్యవసాయ అధికారి, సింగిల్ విండో చైర్మన్ రఘు, ఇతర అధికారులు ఉన్నారు.
వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి..
రాజనగరం సమీపంలో శుక్రవారం పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాల శిబిరాన్ని సందర్శించి గోర్రెలు, మేకలకు టీకాల పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. జిల్లాలోని అన్ని గొర్రెలు, మేకలకు సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని పెంపకందారులకు సూచించారు. ప్రస్తుతం నీలి నాలుక వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ ఇవ్వాలన్నారు. టీకాల పంపిణీకి ముందురోజు పెంపకందారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నట్టల నివారణ మందులు, శునకాల బారిన పడకుండా జాలీలు పంపిణీ చేయాలని పెంపకందారులు కలెక్టర్‌ను కోరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, పశు వైద్యులు, ఇతర అధికారులు, స్థానికులు కురుమూర్తి, గోపాల్ తదితరులు ఉన్నారు.