
చేనేతల ఆర్థిక సాధికారతకు కృషి
వనపర్తి: ప్రస్తుత పోటీ ప్రపంచంలో చేనేత కార్మికులు వ్యాపార పరంగా నిలదొక్కుకుని ఆర్థిక సాధికారత సాధించేందుకు ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై నేత కార్మికులకు చేనేత దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం జిల్లాలోని ఉత్తమ నేత కార్మికులను శాలువాలు, జ్ఞాపికలతో సత్కరించి మాట్లాడారు. ప్రభుత్వం నేతన్నకు బీమా, రూ.లక్ష రుణమాఫీ, నేతన్న పొదుపు వంటి పథకాల ద్వారా చేనేత కార్మికులను ఆదుకుంటుందన్నారు. ఇటీవలే రూ.లక్ష వరకున్న చేనేత రుణాలను మాఫీ చేసిందని.. చేనేత భరోసా పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సైతం స్వీకరిస్తున్నారని గుర్తుచేశారు. కార్మికులు తమ నైపుణ్యాలు మెరుగుపర్చుకునేందుకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ద్వారా శిక్షణ సైతం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రధానమంత్రి స్వయం ఉపాధి పథకంలో కూడా రుణాలు ఇస్తున్నామని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలోని నేత కార్మికులు తయారు చేసిన దుస్తులు అందిస్తే డబ్బులు చెల్లించడమేగాకుండా ప్రచార నిమిత్తం కలెక్టరేట్‌లో నమూనాగా ప్రదర్శిస్తామని తెలిపారు. అధికారులు ప్రతి సోమవారం నేత దుస్తులు ధరించి విధులకు హాజరయ్యేలా ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పారు. అంతకుముందు ఇన్‌ఛార్స్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు సైతం ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన కొత్తరకం దుస్తులు తయారు చేయాలని సూచించారు. జిల్లాలో 590 మంది కార్మికులకు చేనేత పింఛన్లు అందిస్తున్నామని.. బ్యాంక్ లింకేజీ రుణాలు తీసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. అనంతరం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు మాధవి, హితస్విని, ఫజియా సుల్తానా, ఉపన్యాస పోటీలో సత్తా చాటిన ఎస్.నవ్య, సౌమ్య, గౌతమికి కలెక్టర్ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. అనంతరం కలెక్టర్, అధికాారులు చేనేత స్టాళ్లను తిలకించారు. కార్యక్రమంలో చేనేతశాఖ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ అధికారి ప్రియాంక, వెల్టూరు చేనేత సొసైటీ అధ్యక్షుడు వెంకటయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, జిల్లా అధికారులు, చేనేత కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆదర్శ్ సురభి