
ముమ్మరంగా నిర్మాణాలు
ఇందిరమ్మ ఇళ్లలో 63 శాతం పురోగతి
●
అవగాహన కల్పిస్తున్నాం..
పురపాలికలోని 10 వార్డుల్లో 56 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రోసీడింగ్‌లు అందించాం. వీరిలో 26 మంది మార్కింగ్ పూర్తి చేసుకొని బేస్‌మెంట్ పనులు చేపడుతున్నారు. మిగిలిన వారిని కలిసి త్వరగా పనులు ప్రారంభించాలని అవగాహన కల్పిస్తున్నాం.
– నాగరాజు, పుర కమిషనర్, అమరచింత
పురోగతి సాధిస్తున్నాం..
కలెక్టర్ ఆదేశాల మేరకు నిరంతరం గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులకు నిర్మాణాలపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 3,084 మంది లబ్ధిదారులు మార్కింగ్ పూర్తి చేసుకోగా.. 488 మంది బేస్‌మెంట్ వరకు నిర్మాణాలు చేపట్టారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో విడతల వారీగా డబ్బులు జమ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జిల్లావ్యాప్తంగా 63 శాతం పురోగతిలో సాధించాం.
– విఠోభా, జిల్లా హౌసింగ్ అధికారి
అమరచింత: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు నిత్యం అవగాహన కల్పిస్తూ పనుల్లో వేగం పెంచేందుకు కృషి చేస్తుండటంతో ప్రస్తుతం జిల్లాలో 63 శాతం పురోగతిలో ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 6,538 మందిని లబ్ధిదారులుగా గుర్తించగా.. 5,938 మందికి ప్రొసీడింగ్‌లు అందజేశారు. ఇప్పటి వరకు 3,048 మంది మార్కింగ్ వేసుకొని బేస్‌మెంట్ పనులు ప్రారంభించగా.. 488 మంది లబ్ధిదారులు బేస్‌మెంట్ నిర్మాణం పూర్తిచేసి ప్రభుత్వం నుంచి మొదటి విడతగా రూ.లక్ష అందుకున్నారు. నిర్మాణాలు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు హౌసింగ్ అధికారులు నిరంతరం గ్రామాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులకు సూచనలిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.5 లక్షలకు తోడుగా అదనంగా మరో రూ.రెండు లక్షల నుంచి రూ. మూడు లక్షల వరకు జోడించి సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు లబ్ధిదారులు సిద్ధమవుతున్నారు.
ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ..
ప్రభుత్వ నిబంధనల మేరకు వంట గది, హాలు, బెడ్‌రూంతో పాటు ఇంటి ఆవరణలో మరుగుదొడ్డి నిర్మాణం చేపడుతున్నారు. పాత ఇంటిని పడగొట్టి కొత్తగా నిర్మాణం చేపట్టే వారితో పాటు ఖాళీ ప్లాట్లలో ఇంటిని నిర్మించుకునే వారు చుట్టూ రెండు ఫీట్ల స్థలం వదలాలని అధికారులు సూచిస్తుండటంతో అలాగే చేపడుతున్నారు.
విడతల వారీగా చెల్లింపులు..
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో విడతల వారీగా డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. బేస్‌మెంట్ నిర్మాణం పూర్తయితే రూ.లక్ష, పైకప్పు వరకు గోడలు నిర్మిస్తే రూ.లక్ష, పైకప్పు నిర్మాణం పూర్తిచేస్తే రూ.2 లక్షలు, మరుగుదొడ్డితో పాటు పెయింటింగ్, విద్యుత్ పనులు పూర్తిచేస్తే రూ.లక్ష వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నామని హౌసింగ్ అధికారులు వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు బేస్‌మెంట్ నిర్మాణం పూర్తి చేసుకున్న 488 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.6 కోట్లు జమ చేసినట్లు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపులపై లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ మార్కింగ్ ఇచ్చిన 3 వేల నిర్మాణాలు బేస్‌మెంట్ వరకు పూర్తి చేసేలా రోజువారీగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలోని 255 గ్రామాలతో పాటు 5 పురపాలికల్లోని 80 వార్డుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మంజూరు పత్రాలు అందుకున్న 45 రోజుల్లో పనులు ప్రారంభించకపోతే రద్దు చేస్తామనే ప్రభుత్వ హెచ్చరికతో లబ్ధిదారులు పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు 3,048 లబ్ధిదారులు ఖాళీ స్థలాల్లో మార్కింగ్ పూర్తిచేయగా.. 488 మంది బేస్‌మెంట్ వరకు, 141 మంది గోడల వరకు, 78 మంది పైకప్పు వరకు నిర్మాణం పూర్తి చేసినట్లు అధికారులు వివరించారు. ఒక్కరు మాత్రమే ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని గృహ ప్రవేశం చేసినట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 63 శాతం ఇళ్ల నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయని వెల్లడిస్తున్నారు.
జిల్లాలో 6,538 మంది లబ్ధిదారులు
ఇప్పటి వరకు రూ.ఆరు కోట్ల చెల్లింపులు
అధికారుల పర్యవేక్షణతోనే పనుల్లో వేగం

ముమ్మరంగా నిర్మాణాలు

ముమ్మరంగా నిర్మాణాలు

ముమ్మరంగా నిర్మాణాలు