
సాగునీరు అందించే వరకు పోరాడుతాం
పాన్‌గల్: ప్రాజెక్టుల్లో నీరు నిండుగా ఉన్నా.. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంతో రైతులకు సాగునీరు అందించలేని దుస్థితి నెలకొందని, నీటి సరఫరా జరిగే వరకు అన్నదాతల పక్షాన నిలబడి పోరాడుతామని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం పార్టీ నాయకులు, రైతులతో కలిసి మండలంలోని దావాజిపల్లి, మాందాపూర్, రాయినిపల్లిలో ఉన్న కేఎల్‌ఐ డీ–8 ఎంజే–4, భీమా డీ–18, డీ–19 కాల్వలను ఆయన పరిశీలించి మాట్లాడారు. కాల్వల్లో పేరుకుపోయిన జమ్మును తొలగించకపోవడంతో చివరి ఆయకట్టుకు సాగునీరు సక్రమంగా అందడం లేదన్నారు. గతంలో కాల్వలో పేరుకుపోయిన జమ్మును సొంత ఖర్చులతో తొలగించామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా గ్రామాల్లో రైతులే స్వయంగా జమ్ము తొలగించుకునే పరిస్థితి నెలకొందని చెప్పారు. సాగునీరు అందని గ్రామాల రైతులు అధికారులకు ఫోన్లు చేసి ప్రశ్నిస్తే నీరు పారేంత వరకు పంటలు సాగు చేసుకోవాలని వింత జవాబులు ఇస్తున్నారని చెప్పారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి జమ్ము, అక్రమంగా ఏర్పాటు చేసిన పైపులను తొలగించి సాగునీరు సాఫీగా ముందుకు పారేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, పార్టీ ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌నాయక్, మండల అధ్యక్షుడు వీరసాగర్, ఉపాధ్యక్షుడు తిలకేశ్వర్‌గౌడ్, కార్యదర్శి భాస్కర్‌ర్‌రెడ్డి, సుధాకర్‌యాదవ్, దశరథనాయుడు, రాజేశ్వర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, రమణయ్య, శేఖర్‌నాయుడు, కృష్ణయ్యగౌడ్, వివిధ గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.