
అధిక దిగుబడినిచ్చే ఉద్యాన పంటలపై దృష్టిసారించండి
కొత్తకోట రూరల్: తక్కువ నీటితో ఎక్కువ దిగుబడినిచ్చే ఉద్యాన పంటల సాగుపై రైతులు దృష్టిసారించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డా.దండా రాజిరెడ్డి సూచించారు. సోమవారం పెద్దమందడి మండలం మోజర్ల సమీపంలోని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన కళాశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ.. పర్యావరణ మార్పులు, పంటలు సంబంధిత అంశాలపై లోతైన పరిశోధనల కోసం ప్రత్యేక పరిశోధన స్థానం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. వేగంగా దూసుకొస్తున్న పర్యావరణ మార్పులను తట్టుకునేందుకు ఉద్యాన పంటలను విరివిగా పెంచాల్సిన అవసరముందన్నారు. మెట్ట ఉద్యాన పంటలైన ఉసిరి, చింత, జాము, సపోట, వాక్కాయ, కుంకుడు, దానిమ్మ, సీతాఫలం, మునగ తదితర తోటల సాగుపై దృష్టిసారించాలని సూచించారు. పండ్ల తోటల సాగుతో పాటు అంతర పంటలు తప్పనిసరిగా సాగు చేయాలని సూచించారు. అదే విధంగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తక్కువ కాలంలో కోతకొచ్చే కూరగాయలు, ఆకుకూరలు, ఏక వార్షిక రకాలు, ప్రాంతానికి అనువైన ఔషధ మొక్కలను సైతం సాగు చేసుకోవచ్చన్నారు. సకాలంలో కత్తిరింపులు చేయడం, నీటి సంరక్షణ పద్ధతులు పాటించడం ముఖ్యమన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎ.భగవాన్, డీన్ చీనా, కన్సల్టెంట్ కె.వీరాంజనేయులు, అసోసియేట్ డీన్ పిడిగం సైదయ్య, ప్రొఫెసర్లు షహనాజ్, శ్రీనివాస్, శంకర్ స్వామి, గౌతమి, విద్య, భాస్కర్, నవ్య, శ్వేత పాల్గొన్నారు.