
వ్యవసాయ భూమి వేలానికి చర్యలు
అమరచింత: ఆత్మకూర్ ప్రాథమిక వ్యవసాయ కార్మిక సంఘంలో వ్యవసాయ భూములపై రుణాలు పొంది తిరిగి చెల్లించని రైతుల పొలాలను వేలం వేయడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. ఈ మేరకు అమరచింత మండలంలోని దీప్లానాయక్‌తండాకు చెందిన దీప్లానాయక్ ఎల్‌టీ రుణం తీసుకుని తిరిగి చెల్లించడం లేదంటూ సదరు వ్యక్తికి చెందిన వ్యవసాయ పొలాన్ని ఈ నెల 12న వేలం వేస్తున్నామంటూ సోమవారం పట్టణంలో టాంటాం వెయించారు. సహకార సంఘం సీఈఓ నరేష్ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టణంలోని ప్రధాన వీధులతోపాటు యూనియన్ బ్యాంక్ పరిసరాలు, దీప్లానాయక్‌తండాలో కరపత్రాలను పంచుతూ సరైన గడువులో డబ్బులు చెల్లించకుంటే పొలం వేలం వేస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలంలో పాల్గొనాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈఓ నరేష్ మాట్లాడుతూ తమ సొసైటీలో 61 మంది రైతులు ఎల్‌టీ రుణాలు తీసుకుని మొండిబకాయి దారులుగా ఉన్నారని, వీరి ద్వారా సుమారు రూ.90 లక్షలు రావాల్సి ఉందన్నారు. బకాయిల వసూళ్ల కోసం పలుమార్లు నోటీసులు పంపామని, సదరు రైతుల ఇళ్లకు వెళ్లి చెల్లించాలని కోరినా ఫలితం లేదన్నారు. దీంతో మొండిబకాయిదారుల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామన్నారు. వారి ఆదేశాల మేరకు రికవరీలో భాగంగా దీప్లానాయక్ ద్వారా రూ.16 లక్షలు వసూలు చేసుకునేందుకు సదరు వ్యక్తికి చెందిన సర్వే నంబర్ 203, 201, 221లో 13.26 ఎకరాల పొలాన్ని వేలం వేస్తున్నామని పేర్కొన్నారు.