
భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి
వనపర్తి: భూ భారతి చట్టం–2025 రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సెక్రటరీ లోకేష్‌కుమార్ అదరపు కలెక్టర్లను ఆదేశించారు. జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై అదనపు కలెక్టర్లతో రెవెన్యూ సెక్రెటరీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలని సూచించారు. ఆగస్టు 15న ఎల్‌బీ స్టేడియంలో గ్రామ పరిపాలన అధికారులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులమీదుగా నియామక పత్రాలు అందజేస్తారని, అందుకు అవసరమైన ఖాళీలు, రోస్టర్ తదితర ప్రక్రియ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వీసీలో పాల్గొన్న అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో 7,648 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించడానికి ఇప్పటి వరకు 8,837 నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. ఇప్పటి వరకు 696 దరఖాస్తులను ఆమోదించి అప్‌డేట్ చేశామన్నారు. నిబంధనలు పాటిస్తూ మిగిలిన దరఖాస్తులను పరిష్కరించడంలో వేగం పెంచుతామన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుబ్రమణ్యం, కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్, సెక్షన్ సూపరింటెండెంట్ మదన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ కీమ్యానాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 53 ఫిర్యాదులు వచ్చాయని కార్యాలయ సిబ్బంది తెలిపారు.