
ముఖ గుర్తింపుతో హాజరు!
వనపర్తి: జిల్లా, మండల పరిషత్ కార్యాలయాల్లో అధికారుల పాలన కొనసాగుతున్న ఏడాది కాలంగా కొందరు ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆయా కార్యాలయాల్లో కొందరు ఉద్యోగులు సమయపాలన పాటించకుండా ఇష్టానుసారంగా విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సమీకృత కలెక్టరేట్ మాదిరిగా జెడ్పీ, ఎంపీడీఓ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నేషన్) హాజరు నమోదు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. గత నెల 16నే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినా.. యంత్రాల కొనుగోలుకు నిధులు లేవని ఎంపీడీఓలు చేతులు ఎత్తేశారు. దీంతో జిల్లా పరిషత్‌తో పాటు 15 మండలాలకు జెడ్పీ నిధులతో యంత్రాల కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఇందుకుగాను కలెక్టర్ అనుమతి కోసం నోట్‌ఫైల్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
● ఉద్యోగుల హాజరు నమోదుకు ఫేస్ రికగ్నేషన్ యంత్రాలు ఏర్పాటు చేయాలంటే ముందుగా ఆయా కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల హోదా, ఇతర వివరాలు సేకరించి యంత్రంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదయం, సాయంత్రం యంత్రంలో నిక్షిప్తమైన ముఖ హాజరును లెక్కించి ఉద్యోగులకు ప్రతి నెల వేతనం చెల్లించే పద్ధతి ఉంటుంది. ప్రస్తుతం ఈ విధానం సమీకృత కలెక్టరేట్‌లో అమలవుతోంది. అదే తరహాలో నాణ్యమైన యంత్రాలు కొనుగోలు చేసేందుకు జెడ్పీ అధికారులు టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
జెడ్పీ, ఎంపీడీవో కార్యాలయాల్లో
అమలుకు ఏర్పాట్లు
గత నెల 16నే ఆదేశించిన
రాష్ట్ర ప్రభుత్వం
యంత్రాల కొనుగోలు జాప్యం
అధికారులు, సిబ్బంది విధుల
డుమ్మాలకు చెక్
పంద్రాగస్టు వరకు పూర్తిచేస్తాం..
పంద్రాగస్టు వరకు జెడ్పీతో పాటు అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో ముఖగుర్తింపు యంత్రాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల హాజరు నమోదుకు చర్యలు తీసుకుంటున్నాం. ధరలు ఎక్కువగా ఉన్నందున తక్కువ ధరకు యంత్రాలు సరఫరా చేసే ఏజెన్సీని ఎంపిక చేసేందుకు ప్రయత్నించటంతో కొంత ఆలస్యమైంది. ఉద్యోగుల వివరాలు సేకరించే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం.
– యాదయ్య, జెడ్పీ సీఈఓ, వనపర్తి

ముఖ గుర్తింపుతో హాజరు!