
చదరంగం క్రీడా నైపుణ్యానికి నిదర్శనం
వనపర్తి: బుద్ధిబలం ప్రదర్శించే చదరంగం భారతీయుల ప్రాచీన క్రీడల్లో ఒకటని.. ఇందులో భారతీయులకు అత్యంత నైపుణ్యం ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని స్పోర్ట్ కార్యాలయంలో కొనసాగుతున్న ఉమ్మడి జిల్లా ఓపెన్ చెస్ పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చదరంగంతో ఆలోచన శక్తి పెంపొందడమేగాక బుద్ధిబలం పెరుగుతుందన్నారు. చదరంగం క్రీడపై చిన్నారులు ప్రాథమిక దశ నుంచే ఆసక్తి కనబర్చేలా ప్రోత్సహించాలని సూచించారు. పోటీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి 180 మంది క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం విజేతలకు ఎస్పీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, నిర్వాహకులు యాదగిరి, టీపీ కృష్ణయ్య, గణేష్ కుమార్, నర్సింహ, వేణుగోపాల్ పాల్గొన్నారు.