
క్రీడారంగానికి ఉజ్వల భవిష్యత్
ఆత్మకూర్: సమగ్ర తెలంగాణ క్రీడా విధానం–2025ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనల మేరకు రూపొందించామని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గురువారం స్థానిక మార్కెట్‌యార్డులో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి స్పోర్ట్స్ కాంక్లెవ్ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందన్నారు. తాను క్రీడల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం జరిగిన మొదటి క్యాబినెట్ సమావేషంలోనే నూతన క్రీడా విధానం ఆమోదింపబడటం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న వివిధ క్రీడారంగ నిష్ణాతులు, క్రీడాసమాఖ్యల ప్రతినిధులతో కలిసి విస్తృతస్థాయిలో స్పోర్ట్స్ కాంక్లెవ్ నిర్వహిస్తున్నామని వివరించారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు, మట్టిలోని మాణిక్యాలను ప్రపంచ ఛాంపియన్లుగా అందించేందుకు నూతన క్రీడావిధానం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
సాట్ బాధ్యతలు మరింత విస్తృతం..
నూతన క్రీడా విధానంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (సాట్) బాధ్యతలు మరింత విస్తరించనున్నాయని.. రాష్ట్రం నుండి అంతర్జాతీయ క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని సాట్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ఏడాది కాలంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారటీ ఆధ్వర్యంలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, రానున్న రోజుల్లో రెట్టింపుస్థాయిలో చేపడతామని వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి సుధీర్‌కుమార్‌రెడ్డి, మార్కెట్ చైర్మన్ రహ్మతుల్లా, మాజీ ఎంపీపీ డా. శ్రీధర్‌గౌడ్, నాయకులు పరమేష్, నల్గొండ శ్రీను, తులసిరాజ్, భాస్కర్, మశ్ఛందర్‌గౌడ్, అజ్మతుల్లా, షాలం, రఫీక్, దామోదర్, సాయిరాఘవ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ఆలోచనల ప్రతిరూపమే నూతన క్రీడా విధానం
రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి