
పనితీరు ప్రజలు మెచ్చేలా ఉండాలి
వీపనగండ్ల: సిబ్బంది పనితీరు ప్రజలు మెచ్చేలా ఉండాలని.. అప్పుడే గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతామని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని, గ్రామానికి ఒక పోలీసు అధికారిని కేటాయించి వీపీఓ విధానం పకడ్బందీగా అమలు చేస్తామని వెల్లడించారు. నేరాల నియంత్రణకు రాత్రిళ్లు పటిష్టంగా గస్తీ నిర్వహిస్తామని, ఏవైనా ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో గౌరవంగా మెలుగుతూ రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. ముఖ్యంగా మహిళల ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సమన్వయంతో వ్యవహరించినప్పుడే ఆ స్టేషన్‌కు మంచి పేరు వస్తుందన్నారు. ఆయన వెంట డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, రిజర్వ్‌డ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ రాణి, మంజునాథరెడ్డి, పోలీసు సిబ్బంది ఉన్నారు.
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ..
సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం మండలంలోని పుర్గర్‌చర్లలో గ్రామ రైతు సంఘం, మహిళా సంఘం సంయుక్తంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని.. గ్రామాల్లో ఏర్పాటు చేసుకుంటే శాంతిభద్రతలను పూర్తిస్థాయిలో పరిరక్షించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వారిని ఎస్పీ అభినందించారు.
ఎస్పీ రావుల గిరిధర్