
మాధవరెడ్డి ఎత్తిపోతలకు గ్రీన్‌సిగ్నల్
వనపర్తిటౌన్: ఖాసీంనగర్ (మాధవరెడ్డి) ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపారని.. దీంతో 6 గ్రామాలు, 13 తండాల్లోని 4 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఖాసీంనగర్, జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తాయిపల్లి, అంజనగిరి గ్రామాలతో పాటు మరో 13 గిరిజన తండాలకు సాగు నీరు అందుతుందన్నారు. ఖాసీంనగర్ లిఫ్ట్ ఇరిగేషన్‌కు మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్‌గా నామకరణం హర్షణీయమని, ఆయన వైద్యసేవలను గుర్తిస్తూ సీఎం పేరు పెట్టారని వివరించారు. రామన్నగట్టు రిజర్వాయర్‌కి నీరు తెచ్చి మూడు లిఫ్ట్‌ట్‌ల ద్వారా సాగునీరు అందిస్తామని, మొదటి లిఫ్ట్ ద్వారా ఖాసీంనగర్‌లోని వెయ్యి ఎకరాలకు, రెండో లిఫ్ట్ ద్వారా దత్తాయపల్లి, అంజనగిరిలోని వెయ్యి ఎకరాలకు, మూడో లిఫ్ట్ ద్వారా జయన్న తిరుమలాపురం, మున్ననూరు, అప్పాయిపల్లి, దత్తాయిపల్లిలోని రెండు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. ఏళ్లుగా చివరి ఆయకట్టుకు సాగునీరు రాక ఇబ్బందులు పడుతున్న రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నందిమళ్ల యాదయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి చీర్ల జనార్దన్, పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షుడు కదిరె రాములు, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు సమద్‌మియా, సీనియర్ నాయకులు కోళ్ల వెంకటేష్, వెంకటేశ్వర్‌రెడ్డి, మెంటెపల్లి రాములు, అబ్దుల్లా, కమర్ రహమాన్, గడ్డం వినోద్, రాగి అక్షయ్, నాగార్జున, ఇర్ఫాన్, చరణ్, రాంబాబు, లక్ష్మయ్య పాల్గొన్నారు.