
రామన్‌పాడులో నిలకడగా నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో ఆదివారం సముద్రమట్టానికి పైన 1,020 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ కాల్వ నుంచి 550 క్యూసెక్కులు, సమాంతర కాల్వ నుంచి 200 క్యూసెక్కుల వరద జలాశయానికి చేరుతుండగా.. ఎన్టీఆర్ కాల్వకు 679 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 30 క్యూసెక్కులు, వివిధ ఎత్తిపోతల పథకాలకు 872 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
ఆధార్, బయోమెట్రిక్
నవీకరణ తప్పనిసరి
వనపర్తి విద్యావిభాగం: యూడైస్‌లో ఆధార్, అపార్ వివరాల నమోదు తప్పనిసరి కావడంతో ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఆదేశానుసారం జిల్లాల్లోని జూనియర్ కళాశాలల విద్యార్థుల ఆధార్ నమోదు, బయోమెట్రిక్ నవీకరణ ప్రక్రియ ప్రారంభమైందని డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. విద్యార్థులు ఆధార్ కేంద్రాల వద్దకు వెళ్లి ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కళాశాలల్లోనే ఈ ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించారని చెప్పారు. విద్యార్థుల ఆధార్ నమోదు, బయోమెట్రిక్ నవీకరణకు SNRE&data Pvt Ltd ఏజెన్సీ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు వస్తుందని, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ ప్రతి విద్యార్థి వివరాలను నవీకరించాలని సూచించారు.
నిరుద్యోగ సమస్యలపై నిరంతర పోరాటం
అమరచింత: నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి డీవైఎఫ్‌ఐ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత మత్తు పదార్థాలకు బనిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ గేమ్‌ల పేరిట తల్లిదండ్రులకు తెలియకుండా అప్పులు చేసి చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి యువతరం చేరుకోవడం శోచనీయమన్నారు. కళాశాల, పాఠశాలల వద్ద జరిగే మత్తు పదార్థాల ముఠాలను అడ్డుకోనేందుకు డీవైఎఫ్‌ఐ ప్రణాళికతో ముందుకు సాగుతుందని చెప్పారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, చంటి, తిరుపతి, అశోక్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
30న కొలువుదీరనున్న మార్కెట్ పాలకవర్గం
● హాజరుకానున్న మంత్రులు
ఆత్మకూర్: స్థానిక వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ఈ నెల 30న కొలువుదీరనుంది. చైర్మన్‌గా ఎండీ రహ్మతుల్లాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఏపీసీ, ఎఫ్‌ఏసీ కార్యదర్శి సురేంద్రకుమార్ ఇదివరకే ఉత్తర్వులు వెలువరించగా రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి నియామక పత్రం అందజేశారు. ఇదిలా ఉండగా పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర మంత్రులు సీతక్క, వాకిటి శ్రీహరితో పాటు ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకుడు అజారుద్దీన్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సమితి చైర్మన్ సీతమ్మ తదితరులు హాజరుకానున్నట్లు రహ్మతుల్లా తెలిపారు. మొదట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట మధ్యాహ్నం 12 గంటలకు బాబు జగ్జీవన్‌రాం విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని వివరించారు. ఈ మేరకు పాలకవర్గ సభ్యులు, మార్కెట్ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

రామన్‌పాడులో నిలకడగా నీటిమట్టం