
జాబ్ క్యాలెండర్ జాడేది?
వనపర్తిటౌన్: వేలాది మంది నిరుద్యోగులు పట్టాలు చేతబట్టుకొని ఉద్యోగ ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నారని, ఎన్నికల సమయంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ప్రశ్నించారు. ఆదివారం గద్వాల నుంచి జిల్లాకేంద్రానికి వచ్చిన ఆయనకు పార్టీ శ్రేణులు మర్రికుంట వద్ద స్వాగతం పలకగా భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో పట్టణంలోని ఛత్రపతి శివాజీ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ భారీ గజమాలతో స్వాగతం పలికిన అనంతరం ర్యాలీగా లక్ష్మీకృష్ణ గార్డెన్స్‌కు చేరుకున్నారు. అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు నమ్మక ద్రోహం చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ 11 ఏళ్ల అవినీతి రహిత పాలన, వికసిత్ భారత్ లక్ష్యాన్ని గడపగడపకు వివరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు శక్తివంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచారి మాట్లాడుతూ.. పేదలు ఆర్థికంగా ఎదిగితేనే ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుందని, మోదీ వికసిత్ భారత్ లక్ష్యంతో పేదలు, మహిళలు, యువత, రైతులకు అండగా నిలిచేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. కరోనా సమయం నుంచి నేటి వరకు 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఐదు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారని, ప్రతి రైతుకు ఏటా పీఎం కిసాన్ పథకం ద్వారా రూ.6 వేలు అందిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గడపగడపకు చేరుస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎంపీ పి.రాములు, నాగర్‌కర్నూల్ ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, మాజీ శాసనసభ్యుడు డా.రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు సబిరెడ్డి వెంకటరెడ్డి, అయ్యగారి ప్రభాకర్‌రెడ్డి, మున్నూరు రవీందర్, మెంటేపల్లి రాములు, గౌని హేమారెడ్డి, బి.శ్రీశైలం, జ్యోతి రమణ, చిత్తారి ప్రభాకర్, కదిరె మధు, అలివేలమ్మ, రామన్‌గౌడ్, సుమిత్రమ్మ, కుమారస్వామి, వెంకటేశ్వరరెడ్డి, బాశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
అడ్డగోలు హామీలతో
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్
స్థానిక ఎన్నికల్లో
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఎన్.రాంచందర్‌రావు