
ఆరు హామీల అమలు ఏమైంది..? : సీపీఎం
అమరచింత: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ఏమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు ప్రశ్నించారు. మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో కొనసాగుతున్న పార్టీ రాజకీయ శిక్షణ తరగతుల రెండోరోజు ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా.. మహిళలకు నెలకు రూ.2,500 నగదు, చేయూత పింఛన్ రెట్టింపు నీటి మూటలుగానే మిగిలాయని విమర్శించారు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల హామీ కేవలం గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా పురపాలికల్లోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. బనకచర్ల ప్రాజెక్టుపై ప్రధాని మోదీతో చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అఖిలపక్ష నాయకులను ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచించారు. పాలమూర్–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కేంద్రం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు రహదారులు దెబ్బతిన్నాయని.. కొత్త నిర్మాణాలు చేపట్టాలని కోరారు. అమరచింత దుంపాయికుంటలో ప్లాట్ల హద్దులు చూపించాలంటూ మూడేళ్లుగా పేదలు గుడిసెలు వేసుకొని పోరాటం చేస్తున్నామని, సమస్యను మంత్రికి విన్నవించినా పెండింగ్‌లో ఉంచడం సరైంది కాదన్నారు. జిల్లాలో అంసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించి అభివృద్ధికి పాటు పడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకులు మహమూద్, మండల కార్యదర్శి జీఎస్ గోపి, ఆత్మకూర్, మదనాపురం మండల కార్యదర్శులు రాజు, వెంకట్రాములు, జిల్లా నాయకులు వెంకటేష్, ఆర్‌ఎన్ రమేష్, అజయ్, అనంతమ్మ, రాఘవేంద్ర, నర్సింహ, శంకర్, బుచ్చన్న, రాఘవ, కాకి శ్రీను తదితరులు పాల్గొన్నారు.